బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించుకుంది. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే భార్యనే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పొలిట్ బ్యూరో భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ కూడా పోటీ చేయకూడదని నిర్ణయించింది. బీజేపీ నేతలు మాత్రం తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు. అయితే ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.
బద్వేలులో ఎకగ్రీవానికి సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగలేదు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇటీవల సంప్రదాయాలను గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2015లో తిరుపతి ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవానికి వైసీపీ సహకరించింది. అభ్యర్థిని పెట్టలేదు. అయితే అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కరే బరిలో న్నారు. కానీ నంద్యాలలో చనిపోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చినా వైసీపీ అభ్యర్థిని నిలబెట్టింది. అదే సమయంలో తిరుపతిలో చనిపోయిన ఎంపీ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే వీటిని టీడీపీ మర్చిపోయింది. అడగకపోయినా ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించుకుంది.
వాస్తవంగా బద్వేలులో వైసీపీ గెలవడం ఖాయమే.ఎంత మెజార్టీ అనేదే కీలకం. మెజార్టీని లక్ష్యంగా చేసుకున్న వైసీపీ .. ఓటింగ్ కోసం దేనికైనా తెగించే పరిస్థితి ఉంది. ఈ కారణంగా టీడీపీ నేతలు కూడా రిస్క్ ఎందుకని భావించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కూడా వెనక్కి తగ్గితే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎవరికీ రూపాయి ఖర్చుఉండదు.