ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎవరూ కలిసే పరిస్థితి లేదు. కలసి కట్టుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో జనసేన – బీజేపీ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోము వీర్రాజు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌తో బద్వేలు ఎన్నికపై చర్చించినా అసలు ఎవరు పోటీ చేయాలి. .. పోటీ చేయాలా వద్దా అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాము పోటీ చేయడం లేదని నేరుగా బీజేపీకి చెప్పడానికి కూడా సిద్ధపడలేదు.
ఆయన తన నిర్ణయాన్ని జనం మధ్యనే ప్రకటించారు. పవన్ ప్రకటించే వరకూ బీజేపీ నేతలకు కూడా ఈ విషయం తెలియదు. జనసేన మద్దతిస్తుందని.. లేకపోతే జనసేనకు తాము మద్దతిస్తామని అనుకుంటూ ఆది వారం కడపలో సమావేశం పెట్టారు. కానీ జనసేన సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇక పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. టీడీపీ కూడా పోటీలో లేకపోవడంతో ఇదే అదనుగా గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుని బలపడ్డామన్న సంకేతాలను పంపాలని నిర్ణయించారు.
2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి అనే నేతతో పోటీ చేయడానికి మంతనాలు జరిపారు. ఆమె కూడా అంగీకరించారని నేడో రేపో అభ్యర్థి ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ చేస్తారో లేదో కానీ మొత్తానికి బీజేపీతో కటిఫ్కు జనసేన మొదటి అడుగు వేసిందనే అభిప్రాయం మాత్రం బద్వేలు ఉపఎన్నికతో స్పష్టమయిందంటున్నారు.