ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్న బాధ్యతలన్నీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా సలహాదారు పదవి పొందిన ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసేందుకు విధివిధానాలు , జీత భత్యాల ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్రంతో పనులు చక్కబెట్టడం గురించే అన్ని పనులు ఉన్నాయి. గతంలో ఈ వ్యవహారాలను చూసే బాధ్యత విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.
ఆయనకు విరుద్ధ ప్రయోజనాల కింద పదవీ గండం ఉందని న్యాయనిపుణులు చెప్పడంతో అప్పటికప్పుడు చట్టాన్ని కూడా మార్చేశారు. ఢిల్లీలో వైసీపీ అంటే తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. ఢిల్లీలోఆయన పాత్ర తగ్గుతూ వస్తోంది.తాజాగా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించారు. విజయసాయిరెడ్డి తీరు కూడా ఇటీవల మారిపోయింది. ఆయనపై వైసీపీ హైకమాండ్‌కు పూర్తి స్థాయిలో విశ్వాసం సన్న గిల్లిందని చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే ఆయనకురాజ్యసభ సభ్యత్వం కొనసాగించడం కష్టమని.. చివరికి పార్టీ తరపున ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా తొలగిస్తారని.. మంత్రి వర్గం నుంచి తొలగించే సీనియర్ నేతలకు ఆ స్థానం ఇస్తారన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది. అదే జరిగితే.. వైసీపీలో నెంబర్ టూ స్టేజ్‌లో ఉండి చక్రం తిప్పిన మైసూరారెడ్డి లాంటి వారి పరిస్థితే విజయసాయిరెడ్డికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.