సీఎం జగన్ బావ.. కేటీఆర్ నా ఫ్రెండ్ అంటూ మా ఎన్నికల్లో హడావుడి చేస్తున్న మంచు విష్ణుకు ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని షాక్ ఇచ్చారు. మూ వీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని. ఎవర్నీ సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయడం లేదని పేర్ని నాని ఓ ప్రకటనను ప్రభుత్వం తరపున చేశారు. ఏ వర్గంపైనా ప్రత్యేకమైన ఆసక్తి ప్రభుత్వానికి లేదన్నారు. దీంతో అంతర్గతంగా మంచు విష్ణుకు మద్దతుగా సీఎం జగన్ ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లయింది.
కారణం ఏమిటో తెలియదు కానీ మొదటి నుంచి మా ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తావన వస్తోంది. సందర్భం ఉన్నా లేకపోయినా మంచు విష్ణు .. జగన్తో తనకు ఉన్న బంధుత్వం గురించి చెప్పుకునే ప్రయత్నం చేయడం వల్లే ఇలా ఓ భావన వచ్చిందని భావిస్తున్నారు. అదే సమయంలో టిక్కెట్ల వివాదంపై రాజకీయం రాజుకోవడంతో ప్రభుత్వం మా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందేమో అన్న అభిప్రాయం ప్రారంభమయింది.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ కూడా … సీఎం జగన్ మంచు విష్ణు బంధువు అయినంత మాత్రాన మా ఎన్నికలకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ వివాదాన్ని ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ వరకూ రాకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తరపున పేర్ని నాని ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.