దేవదేవుడు ఎవర్నీ కాస్త ఎక్కువగా చూడడు. ఆ దేవుడి ముందు అందరూ సమానమే. కానీ ఆయన ఆలనాపాలనా చూస్తున్న వారికి భక్తులు ఎన్నో వర్గాలుగా ఉంటారు. నిన్నటిదాకా డబ్బు, పలుకుబడి, అధికారం ఉన్న భక్తులు ఓ రకంగా.. సాధారణ భక్తులు మరో రకంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ముందు కొత్త కేటగరిని చేర్చబోతున్నారు. అదే “వెనుకబడిన వర్గాల” వారు. ఈ వెనుకబడిన వర్గాలు అనే పదం ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కొత్తగా శ్రీవారి దర్శనానికీ తీసుకొచ్చేశారు.
కులం ప్రకారం శ్రీవారి దర్శనాలకు అర్హతా !?
తిరుమల తిరుపతి దేవస్తానం వారు ” వెనుకబడిన వర్గాల”కు చెందిన వారిలో వెయ్యి మందిని ప్రతి రోజూ తిరుమలకు తీసుకు వచ్చి సకల మర్యాదలతో శ్రీవారి దర్శనాన్ని చేయించాలని నిర్ణయించారు. అయితే అన్ని రోజులూ కాదు కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే. ఈ వెనుకబడిన వర్గాల వారు ఎవరు..? అనే దానిపై టీటీడీ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కులాల లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇలాంటి చాన్స్ ఇస్తున్నారని అనుకోవాలి. అదే నిజం అయితే కులాల ప్రకారం భక్తుల్ని విభజించిన రికార్డు మొదటి సారి టీటీడీకి దక్కుతుంది.
ఇప్పటి వరకూ హిందువులైతే చాలు !
శ్రీవారి భక్తులకు కులాల పట్టింపు లేదు. అన్యమతస్తులు వస్తే మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. భక్తులు ఏ కులం అనేది ఇప్పటి వరకూ టీటీడీ అధికారికంగా ఎప్పుడూ రికార్డు చేయలేదు. హిందువు అయితే చాలు. కానీ ఇప్పుడు హిందువుల్లోనూ వెనుకబడి వర్గాలు అని కొన్ని కులాలకు దర్శనాల్లో ఉచితాలు ప్రారంభిస్తున్నారు ఘనత వహించిన పాలకులు. ఇదే విమర్శలకు కారణం అవుతోంది.
పేద భక్తులను గుర్తించకుండా కులాల కోణం ఎంపిక !
నిజానికి శ్రీవారి దర్శనం అనేది భక్తులకు రోజు రోజుకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. మధ్యతరగతి ప్రజలు ఏడాదికోసారి శ్రీవారిని కుటుంబతో సహా దర్శించుకోవాలకున్నా.. చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది భక్తులు దేవదేవుడి సన్నిధికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నిఖార్సైన భక్తుల్ని..నిరుపేదల్ని గుర్తించి ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయిస్తే దేవుడ్నీ గౌరవించినట్లుగా ఉంటుంది. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం భక్తుల్లో వెనుకబడిన వర్గాలు అంటూ కొంతమందిని విభజించడం అనూహ్యమే.
దారి తప్పుతున్న ఓటు బ్యాంక్ పథకాలు !
భక్తులకు ఉచిత దర్శనాలు చేయించి తమ ఓటు బ్యాంక్ రాజకీయాలు.. తమ పార్టీ నేతల అనుచరులకు తాయిలాలు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. గత ప్రభుత్వంలోనూ జరిగాయి. గత ప్రభుత్వం ఇందు కోసం ప్రత్యేకంగా ఓ పథకం పెట్టి జిల్లాల నుంచి ఉచితంగా భక్తుల్ని తీసుకెళ్లి దర్శనం చేయించి.. ప్రసాదాలు ఇచ్చి తిరిగి తీసుకు వచ్చేది. అయితే అక్కడ వెనుకబడి వర్గాలు అనే లెక్క పెట్టుకోలేదు. దర్శనం చేసుకోలేని పేదలకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత యా పథకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం.. బ్రహ్మోత్సవాల సమయంలో ” వెనుకబడిన వర్గాలు” వారి కోసం ప్రారంభిస్తున్నారు.