దుబాయ్ శీను సినిమాలో పట్నాయక్ క్యారెక్టర్ టైప్‌లో పోలవరం నిధుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోంది. బోలెడంత ఇస్తున్నామని చెప్పి చివరికి మీరే ఇంకా అప్పు ఉన్నారన్న లెక్కలు చెబుతోంది. పనులు చేశాం.. నిధులు రీ ఎంబర్స్ చేయండి అంటూ బిల్లులు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి ఎన్ని కొర్రీలు పెట్టాలో అన్నీ కొర్రీలు పెడుతోంది. కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. రివర్స్ టెండరింగ్ చేసి మేఘా కంపెనీకి పనులు అప్పగించిన తర్వాత..చేసిన ఖర్చు అంటూ ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లులను తిరస్కరించేసింది. దీనికి చెప్పిన కారణం పోలవరం జలాల్లో తాగునీటి కోసం వాడుకునేదానికి కేంద్రం బిల్లులు చెల్లించదట.
ప్రాజెక్ట్ అంటేనే తాగు, సాగునీటి కోసం వాడుకుంటారు. అందులో సాగునీటి కోసం అయ్యే ప్రాజెక్టు ఖర్చుమాత్రమే భరిస్తామంటూ కేంద్రం వితండవాదం ప్రారంభించింది. కేంద్రానికి ఎలా చెప్పాలో తెలియక ఏపీ అధికారులు తలు పట్టుకుంటున్నారు. బిల్లులు పంపుతున్నారు కానీఅందులో సగానికిపైగా వెనక్కి వస్తున్నాయి. మిగిలిన సగం ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1నాటికి సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చునే ఇస్తామని గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. దాని ప్రకారం ఇక వచ్చేది రూ. ఏడు వేల కోట్లు మాత్రమే.
సవరించిన అంచనాలను ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం మాట వరుసకు అడుగుతోంది. కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ లెక్క ప్రకారం వచ్చిన బిల్లులన్నింటినీ తిరస్కరిస్తోంది. చివరికి ప్రధానడ్యాంకు అవసరమైన మట్టి, రాయిని విద్యుత్ కేంద్రం ప్రాంతంలో తవ్వి తీసినందుకు రూ. యాభై కోట్లు ఖర్చు అయితే వాటితో కూడా సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. 2017-18 ధరల ప్రకారం సవరించిన తుది అంచనాలు రూ.55,656.87 కోట్లకు అంగీకరించేది లేదని కూడా స్పష్టంచేసింది. దీంతో ప్రాజెక్టుకు ఆర్థిక కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఓ వైపు 2021 జూన్ కల్లా పోలవరం ప్రారంభిస్తామన్నసీఎం జగన్ ఆ తర్వాత ముహుర్తం మార్చుకుంటూ పోతున్నారు.కానీ పోలవరం ప్రాజెక్ట్ పని ఎక్కడిదక్కడే ఉంది. జోరుగా సాగుతోందంటూ మేఘా కంపెనీ ప్రభుత్వం అప్పుడప్పుడూ ప్రకటించుకుంటూ ఉంటాయి. కానీ పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి.