వచ్చే మార్చి నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుంది అని మంత్రులకు కేబినెట్ భేటీలో సీఎం జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే వచ్చేశారు. ముందుగా అంతర్గత రాజకీయాల వల్ల కకావికలమైన పార్టీని ఓ గాడిలో పెట్టే ప్రయత్నంలో వారు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి దెబ్బకు పార్టీ కుదేలైపోయిందన్న రిపోర్టులు రావడంతో సీఎం జగన్ అర్జంట్‌గా ప్రశాంత్ కిషోర్ టీంను రంగంలోకి దింపారు. ఇప్పుడు పీకే టీం విశాఖలో మకాం వేసి పార్టీ పరిస్థితిని.. నేతల దుస్థితిని.. అంచనా వేసి సరిదిద్దుకోవాల్సిన చర్యలపై వైసీపీ అధినేతకు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
విజయసాయి నిర్వాకాలపై క్లారిటీకి వచ్చిన జగన్ – తప్పు దిద్దుకునేందుకు పీకే టీంకు బాధ్యతలు
ఉత్తరాంణధ్ర వైసీపీ వ్యవహారాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఆయన తానే సర్వాధికారినన్నట్లుగా పరిపాలన చేశారు. ఏ నిర్ణయం అయినా అది పార్టీ అయినా ప్రభుత్వం అయినా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగేది. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు.. ఆయన సన్నిహితులకు అనుచరులు మాత్రమే పార్టీగా మారిపోయారు. వారు మాత్రమే వైసీపీ అని మిగతా వారు కాదన్నట్లుగా పరిస్థితి దిగజారిపోయింది. దీంతో అనేక మంది సంప్రదాయ వైసీపీ మద్దతు దారులు మాకెందుకులే అని సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం కష్టపడినా తమను పట్టించుకోవడం లేదని హైకమాండ్‌కు వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఓ సారి రోడ్డున పడే పరిస్థితి రావడంతో సీఎం జగన్ పిలి చి మాట్లాడారు. అందరితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని విజయసాయిరెడ్డికి చెప్పి పంపించారు. కానీ పరిస్థితులు మెరుగుపడలేదు.
విజయసాయి తీరుతో వైసీపీకి దూరమైన నిఖార్సైన అభిమానులు
విజయసాయిరెడ్డి పార్టీ నేతలను కేవలం ఆర్థిక కోణంలోనే చూస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఎంత ఖర్చుపెట్టుకుంటారు అనే దానిపైనే ఆయన ఔత్సాహికులను ప్రోత్సాహిస్తూ ఉంటారు. విశాఖ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లోనే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. దీంతో నిఖార్సుగా పార్టీ కోసం కష్టపడిన వారందరూ సైడైపోయారు. డబ్బు రాజకీయాలు చేయాలనుకున్న వారు వైసీపీలోపైకి వచ్చారు. వారిదంతా డబ్బు కోణం కావడంతో విశాఖలో వైసీపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోందన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది.
పీకే టీం నివేదిక తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ విషయంలో కీలక నిర్ణయాలు
ఈ విషయం హైకమాండ్‌కు కూడా తెలియడంతో వెంటనే పీకే టీంను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగింది.. ఇప్పుడు సర్దుబాటు చేసుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపైనే ప్రస్తుతం పీకేటీం రీసెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలోని వైసీపీ ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతల్ని కూడా కలిసి అసలు విషయాలను పీకే టీం తెలుసుకుంటోంది. పీకే టీం ఇచ్చే నివేదిక ఆధారంగా విశాఖ వైసీపీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేశారన్న ఓ అభిప్రాయం మాత్రం హైకమాండ్ దృష్టిలో పడిందని అంటున్నారు.