మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చిత్రవిచిత్రంగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్లు కొనడం కూడా ప్రారంభమయింది. చెన్నై, వైజాగ్, బెంగళూరుల్లో నివాసం ఉంటున్న కొంత మంది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన‌్ సభ్యులతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయించాలని మంచు విష్ణు ప్యానల్ నిర్ణయించుకుంది. దానికి తగ్గట్లుగా వారిని సంప్రదించింది. వారి తరపున పోస్టల్ బ్యాలెట్లకు మంచు విష్ణు తరపు వ్యక్తి ఎన్నికల అధికారికి డబ్బులు చెల్లించారు. మొత్తం అరవై ఓట్లకు రూ. 28వేలు చెల్లించారు. అయితే ఈ విషయం తెలిసి ప్రకాష్ రాజ్ ఫైరయ్యారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తన టీం మొత్తం వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల అధికారి కూడా స్పందించారు. కరోనా వల్ల తొలి సారి పోస్టల్ బ్యాలెట్లను పెట్టామని చెప్పారు. ఒక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ. ఐదు వందలు కట్టాలని.. ఇలా అందరి తరపున ఒక్కరే పోస్టల్ బ్యాలెట్లకు డబ్బులు చెల్లించడం సరి కాదని.. తాము వెనక్కి ఇచ్చేశామని చెప్పుకొచ్చారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్ రద్దు చేయడం సాధ్యం కాదన్నారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు. తాము ఏం చేస్తామో చెప్పి గెలవాలి కానీ ఇలా ఓట్లు కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులపై సీనియర్లు నోరు విప్పాలని ఆయన కోరుతున్నారు. ఓటింగ్‌కు రాలేని వాళ్లతో మాట్లాడి వాళ్ల తరపున పోస్టల్ బ్యాలెట్లను వేయించుకోవడానికి మంచు విష్ణు ప్యానల్ చురుగ్గా పని చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఓటుకు నోట్లు..ఇతర తాయిలాలు ఇస్తున్నారన్న ప్రచారం నేపధ్యంలోఈ వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది.