వినాయక చవితి సందర్భంగా పెట్టిన ఆంక్షలతో జరిగిన రచ్చ మరోసారి జరగకూడదని ఏపీ ప్రభుత్వం అనుకుందేమో కానీ దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది. మండపాలు పెట్టుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయిచింది., సున్నితమైన విషయాల్లో రాజకీయం చేయడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రభుత్వ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది.
అయితే దసరా ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్లో మండపాలు పెట్టడం తక్కువే. ఎక్కువగా ఇళ్లలోనే పండుగ చేసుకుంటారు. అయితే వినాయక చవితి మాత్రం ఎక్కువగా పందిళ్ల పండుగ. ఇళ్లతో పాటు ప్రతి కాలనీ , అపార్టుమెంట్లోనూ మండపాలు పెట్టుకుంటారు. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు పెట్టడానికి అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం అయింది. ప్రైవేటు ప్లేసుల్లో పెట్టుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది.
అయితే అప్పటికేఆలస్యం అయిపోయింది. ఈ కారణంగా ఏపీలో వినాయక చవితి వేడుకలు పెద్దగా కనిపించలేదు. అయితే ఈ సారి ఎవరూ పెద్దగా అడగకుండానే అనుమతులు ఇస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసేసింది. మరో వివాదం రాకుండా ముందుగానే జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది.