పట్టుమని 900 ఓట్లు కూడా లేవు. అందులో సగం మంది ఓటే వేయరు అని వాళ్లే చెప్పుకుంటున్నారు. అసలు ఇవి ఎలక్షన్లే కావు – మేమంతా ఒకే కుటుంబం అని `ఫ్యామిలీ డ్రామా` గుప్పిస్తున్నారు. కానీ… చేతలకూ మాటలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ… వాదాలు పెరుగుతున్నాయి. గొంతులు పెద్దవి అవుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు మొదలవుతున్నాయి. వ్యవహారం ఎంత వరకూ వెళ్లిందంటే `మగాడివైతే..` అంటూ ఆవేశకావేశకాలు రెచ్చగొట్టుకునేంత వరకూ వెళ్లాయి. ఇదంతా `మా` గొడవే.
ఎన్నికల బరిలో విష్ణు, ప్రకాష్ రాజ్ ఉన్నారు. నువ్వా? నేనా? అన్నట్టుగానే పోటీ సాగుతోంది. రోజు రోజుకీ.. ఎలక్షన్ హైడ్రామా పెరుగుతూ పోతోంది. ఈరోజు ప్రకాష్ రాజ్, విష్ణు ఇద్దరూ మీడియా ముందుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ గురించిన పెద్ద రచ్చ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రుసుము కట్టడానికి మీరెవరు? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే – బ్యాలెట్ ఓటు ఉంటే తప్పేంటి? కొంతమంది మా సభ్యుల తరపున మేం డబ్బులు కడితే గొడవేంటి? అంటూ విష్ఱు అంటున్నాడు. మీడియా ముందు ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటే `అంత డ్రామా అవసరం లేదు` అంటూ విష్ణు కౌంటరేశాడు. అంతేనా.. చాలా చాలా అనేశాడు.
మంచు ఫ్యామిలీ అని మరోసారి తన కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని విష్ణు హెచ్చరించాడు. ఇప్పటి వరకూ `గారూ` అంటూ సంబోధిస్తున్నానని ఇక మీదట అది కూడా ఉండదని, మా ఫ్యామిలీ జోలికి వస్తే, మీ కుటుంబ విషయాలూ బయటపెడతానని గట్టిగానే ఇచ్చాడు. `బీపీ టాబ్లెట్లు వేసుకోండి` అంటూ మాటి మాటికీ.. ప్రకాష్ రాజ్ని రెచ్చగొట్టేలానే వ్యాఖ్యలు చేశాడు. అంతేనా? తన సినిమా షూటింగ్లో ప్రకాష్ రాజ్, తన కళ్లెదుట దర్శకుడిని అనరాని మాటలు అన్నాడని చెప్పుకొచ్చాడు. నరేష్ కూడా తగ్గలేదు. ప్రకాష్ రాజ్ ఫ్రాడ్ అంటూ ఓ చిట్టా విప్పాడు. గతంలో ఓ నిర్మాతని 7 కోట్లకు మోసం చేసిన వైనాన్ని, అందుకు సంబంధించిన ఆధారాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న జీవితని `ఎల్ బోర్డు` అంటూ సంబోధించాడు. శ్రీకాంత్ తదితరులపై కూడా కౌంటర్లు పడ్డాయి. ఈ ఎన్నికల్ని విష్ఱు, ప్రకాష్ రాజ్ పూర్తిగా వ్యక్తిగతంగా తీసేసుకున్నారు. ఇది వాళ్ల పరువుకి సంబంధించిన వ్యవహారంగా మారింది.
నిజంగా ఇదంతా చూస్తుంటే, ఎన్నికల తరవాత… వీళ్లంతా మెహమొహాలు చూసుకుంటారా? లేదా? అనే అనుమానం వేస్తోంది. సినిమా అనేది చాలా చిన్న పరిశ్రమ. కలిసి పనిచేయాల్సిన సందర్భాలెన్నో వస్తాయి. అలాంటప్పుడు సెట్లో వాతావరణం పాడైపోతుంది. ఇదేమైనా ఎంపీ, ఎంఎల్ఏ ఎన్నికలా? ఇంత హడావుడి చేయడానికి? మా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా – అది కేవలం సేవ చేయడానికే. అంతకు మించి అదనపు అధికారాలు గుర్తింపు ఉండదు. కేవలం దీని కోసమే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రతీ రోజూ.. ఏదో ఓ గొడవ. ఎన్నికల్లో కొత్త కోణం బయటకు వస్తూనే ఉంది. ఎవరో ఒకరు మీడియా ముందుకు రావడం, నోరు జారడం, ఆ తరవాత దానికి కౌంటర్ గా మరో ప్రెస్ మీట్… మరో వివాదం. ఇలా సాగిపోతోంది `మా`. కేవలం 900 సభ్యులున్న ఓ అసోసియేషన్కే ఇంత హడావుడి చేస్తున్నారంటే… రేపు వీళ్లు ఎం.ఎల్.ఏ గానో, ఎంపీగానో పోటీ చేస్తే ఇంకేంత చేస్తారో?