రెహమాన్ స్వరం, గౌతమ్ మీనన్ టేకింగ్ తో.. ఓ బతుకమ్మ పాట చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది కదూ. జాగృతి సంస్థ కూడా అలానే ఊహించింది. బతుకమ్మ కోసం ఓ పాట చేసి పెట్టమని.. వీరిద్దరినీ కోరింది. రెహమాన్ గురించీ, గౌతమ్ మీనన్ గురించి తెలియంది ఎవరికి? పైగా వీళ్లది సూపర్ హిట్ కాంబినేషన్ ఆయె. జాగృతి రూపొందించిన అన్ని బతుకమ్మ పాటలూ సూపర్ హిట్టే. ఒక్కోటి కోట్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్నవు. దాంతో.. ఈసారి బతుకమ్మ పాట బీభత్సంగా ఉంటుందని ఆశించారంతా. ఈరోజే ఆ పాట కూడా విడుదలైంది. కానీ.. పాట వినేసరికి అందరిలోనూ నీరసం ఆవహించేసింది.
చాలా సాదా సీదా ట్యూన్ తో.. `మమ` అనిపించాడు రెహమాన్. టేకింగ్, విజువలైజేషన్ బాగానే ఉన్నా, అవి గౌతమ్ మీనన్ స్థాయిలో లేవని సంగీతాభిమానులు నిట్టూరుస్తున్నారు. బతుకమ్మ ఆత్మని ఈ పాటలో చూపించలేకపోయారని తెలంగాణ వాసులే చెబుతున్నారు. జాగృతి సంస్థ ఆలోచన, వాళ్ల ప్రయత్నం మంచిదే.కానీ.. రెహమాన్, గౌతమ్ ద్వయం తమ స్థాయికి తగిన పాట ఇవ్వలేకపోయింది. ఇది వరకు సురేష్ బొబ్బిలి లాంటి నవతరం సంగీత దర్శకులు చేసిన బతుకమ్మ పాటలు సూపర్ హిట్టయ్యాయి. అప్పుడు ఇంత ఆర్భాటం లేదు, బడ్జెట్ లేదు. కానీ.. ఈసారి పేరున్న వాళ్లని తీసుకొస్తే ఉసూరు మనిపించారు. శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ ని పట్టుకుని ఓ పాట తీసి పెట్టమంటే తీయరా? గౌతమ్ మీననే ఎందుకు? ఇలాంటి పాటలు తెలంగాణ సంస్క్కృతి సంప్రదాయాల్ని బాగా అవగాహన చేసుకున్నవాళ్లతో చేయించాలి. అప్పుడే… సక్సెస్ అవుతాయి. ఈ విషయంలో జాగృతి లెక్క ఈసారి తప్పింది.