తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన పథకాల అమలు గడవులు ఇప్పటి వరకూ జరుగుతున్న ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు మరింత బలం ఇచ్చేదిగా మారింది. కేసీఆర్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ అసెంబ్లీలో కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. దాని ప్రకారం మూడు నెలల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున అమలు చేస్తారు.
ఆ తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. అమలు కంటే ముందే మరోసారి ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని కోరుతారు. దళిత బంధు అమలు చేయాలా వద్దా అన్నదే ఎజెండానే ఆయన ప్రకటించి ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ స్పష్టమైన లక్ష్యంతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ రాజకీయ కోణంలోనే ఉంటాయి. అయితే చివరికి ఆయన అనుకున్నది చేసే వరకూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అంచనా వేయడం కష్టమే.
దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కేసీఆర్ .. వాయిదాలు వేస్తూ పోతున్న పథకాలు ఇతర అంశాలు ముందస్తు వ్యవహారాలను మరింతగా చర్చకు పెడుతున్నాయి. ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం ఆశీస్సులు తప్పనిసరి . అందుకే కేసీఆర్ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ముందస్తుపై ఎప్పుడేం జరుగుతుందో క్లారిటీ లేదు కానీ.. కేసీఆర్ నిర్ణయాలు మాత్రం కొన్నిసంకేతాలను పంపుతున్నాయని అంచనా వేస్తున్నారు.