సీఎం జగన్ మీట నొక్కడం ఓ బ్రాండ్‌గా మారిపోయింది. క్యాంప్ ఆఫీసులో జగన్ ఠీవీగా కూర్చుని ఉండగా ఆయన చుట్టూ మంత్రులు, సీఎస్,డీజీపీ వంటి వారు నిలబడి ఉండగా.. ఆయన చిరునవ్వుతో ల్యాప్ ట్యాప్‌లో మీట నొక్కడం .. ఇప్పటికి అనేక సార్లు జరిగింది. అలా మీట నొక్కిన వెంటనే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడతాయో లేదో కానీ ఆ సీన్ మాత్రం ప్రతి పథకానికి రిపీట్ అవుతుంది. ఈ నెలలో ఆసరా పథకాన్ని సీఎం జగన్ అలా ప్రారంభించడం లేదు. ప్రత్యేకంగా ఒంగోలులో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బహుశా అక్కడ కూడా ఆయన మీటనే నొక్కుతారు.
అయితే సీఎం జగన్ మీట నొక్కడం అంటే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా.. డబ్బుల పంపిణీని ప్రారంభించినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఒకే సారి అందరి అకౌంట్లలో డబ్బులు వేయడం లేదు. విడతల వారిగా పదిహేడో వరకు పంపిణీ చేస్తారు. ఆసరా పథకం కింద ఎన్నికల మేనిఫెస్టో స్వయం సహాయ గ్రూపుల మహిళా సంఘాలకు రూ. 50వేల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ యాభై వేలను నాలుగేళ్లలో నాలుగు వాయిదాల్లో ఇస్తామన్నారు. అందు కోసం రూ. 6400 కోట్లు కేటాయించారు. దాదాపుగా 90 లక్షల మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. అందరికీ యాభై వేల రుణం ఉండదు కాబట్టి.. ఉన్నంత రుణం మాఫీ చేస్తామని పథకం అమలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని పదిహేడో తేదీ వరకూ విడుదల చేస్తారు.
ఒకే సారి అందరి అకౌంట్లలో డబ్బు జమ చేస్తే వచ్చే క్రెడిట్ వేరుగా ఉటుంది. లబ్దిదారులు తమకు పంపిణీ చేశారా లేదా అని ఎదురు చూసే పరిస్థితి ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు ఇబ్బందులు పడుతున్నందున ఇలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి పదిహేడో తేదీ వరకు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. అదనపు అప్పులకు కేంద్రం నుంచి అనుమతులు పొందిన రాష్ట్ర ప్రభుత్వం వారానికి రూ. రెండు వేల కోట్ల చొప్పున ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకుంటోంది.