దేశంలో ఇప్పుడు అతి పెద్ద సమస్య రైతుల్ని కారుతో తొక్కించి చంపేసిన వైనం కాదు. ముంద్రా పోర్టులో దొరికిన వేల కేజీల హెరాయిన్ కాదు. కేవలం షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోవడమే పెద్ద సమస్య. గత మూడు రోజులుగా ఇదే నడుస్తోంది. ఎవరూ రాజకీయ నేతల అరాచకానికి బలైపోయిన రైతుల గురించి మాట్లాడుకోవడం లేదు. దేశాన్ని నిర్వీర్యం చేసేలా దిగుమతి అవుతున్న వేల కోట్ల విలువైన టన్ను ల కొద్దీ డ్రగ్స్ గురించీ మాట్లాడుకోవడం లేదు. మూడో..నాలుగో గ్రామాల డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడని చెబుతున్న షారుఖ్ కొడుకు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఆర్యన్ అరెస్టుతో డ్రగ్స్ సమస్య తీరిపోతుందా ?
ఆర్యన్ ఖాన్ గురించి చిలువలు పలువుగా చెప్పడం ఇప్పటికే ప్రారంభించేశాడు. ఆరన్ ఖాన్ కస్టడీలో ఉండి ఏం చెబుతున్నారో ఆక్షరం పొల్లు పోకుండా బయటకు వస్తోంది. లోపల నిజంగా ఆర్యన్ చెబుతున్నాడో.. చెబుతున్నట్లుగా బయటకు చెబుతున్నారో .. లేక మీడియానే టీఆర్పీ రేసులో కథలు అల్లేస్తుదో చెప్పడం కష్టం. కానీ మొత్తం కథ అంతా ఆర్యన్ చుట్టూనే తిరుగుతోంది. ఆయనతోనే డ్రగ్స్ సమస్య ప్రారంభమైందన్నట్లుగా.. ఆయన రెస్టుతో అంతమైనట్లేనన్నట్లుగా చెబుతున్నారు. చివరికి షారుఖ్ ఖాన్ పెంపకం గురించి కూడా మాట్లాడేస్తున్నారు. దేశంలో ఆ స్వేచ్చ ఉంది. కానీ అంతకు మించిన సమస్యలు కూడా ఉన్నాయి.
దేశంలో డ్రగ్స్ బారిన పడి నిర్వీర్యమవుతున్న లక్షల మందిలో ఆర్యన్ ఒకడు !
షారుఖ్ ఖాన్ కుమారుడు పార్టీలో పాల్గొని కొకైన్ తీసుకున్నాడని వెంటనే మాటు వేసి పట్టుకున్నారు. నిజానికి ఆర్యన్ సూపర్ స్టార్ కుమారుడు కావడం ఒక్కటే అదనపు అర్హత. అలాంటి అర్హత లేని లక్షల మంది భారత దేశ యువత డ్రగ్స్ మత్తులో జోగి సర్వ నాశనం అవుతున్నారు. డ్రగ్స్‌తో ఎవరు పట్టుబడినా వారి వద్ద ఉండే పరిమాణం.. 5 గ్రాములు.. 10 గ్రాములు మాత్రమే. అలాంటి 3 వేల కేజీల హెరాయిన్ పట్టుబడిందంటే అది చిన్న విషయం కాదు. మామూలు విషయం అసలే కాదు. దేశంలో వాటికి డిమాండ్ ఎలా ఉందో తెలియచేసే దుస్థితి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఇలా ప్రతీ చోటా డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆర్యన్ అరెస్టుతో అన్నీ తేలిపోతాయా..?
డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా ఎలివేట్ చేస్తున్న దౌర్భగ్య పరిస్థితి !
డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారిలో సెలబ్రిటీల పిల్లలను వెదుక్కుని .. ట్రాప్ చేసి పట్టుకుని మీడియాలో హడావుడి చేసి.. ఆయన వల్లనే దేశంలో డ్రగ్స్ సమస్య ఉందని చెప్పడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పైగా ఇలాంటి వాటి వల్ల డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా చూసే పరిస్థితి వస్తోంది. డబ్బున్న వారి కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువ. ఆర్యన్ వ్యవహారానికి ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యం వల్ల దేశానికి ఏ మాత్రం లాభం లేకపోగా యువతలో డ్రగ్స్ పై మరింత క్రేజ్ తీసుకు రావడానికి కారణమవుతూ తీవ్ర నష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ఆలోచించేదెవరు..?