రఘురామకృష్ణరాజు వదిలి పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆయన స్వయంగా ప్రకటించారు. ఇంకా హైకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందో లేదో స్పష్టత లేదు. జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని రఘురమ వేసిన పిటిషన్‌ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టి వేసింది. విచారణను కావాలనే ఆలస్యం చేస్తున్నారని.. కోర్టుకు హాజరు కావడం లేదని.. 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలంటే జగన్ బెయిల్ రద్దు చేయడమే మార్గమని పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా రఘురామకృష్ణరాజు తెలిపారు.
బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు. ఈడీ కోర్టుకు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలని రఘురామ వ్యాఖ్యానించారు. పిటిషన్‌కు విచారణ అర్హత ఉందోలేదో హైకోర్టు తేల్చనుంది. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని రఘురామ ప్రకటించారు.
రఘురామ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉంటే మళ్లీ వాదనలు ప్రారంభమవుతాయి. ఇరు వర్గాలు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. సీబీఐ కూడా వాదనలు వినిపించాల్సిన పరిస్థితి వస్తే ఈ సారి విచారణ కీలకంగా మారే అవకాశం ఉందని రఘురామ భావిస్తున్నారు.