రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారశైలి ఇటీవలి కాలంలో పూర్తిగా మారిపోవడం వైసీపీ నేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. తిట్టే నోరు ఊరుకోదని సామెత. అలా ఊరుకుంటే.. ఏదో జరిగిందని అనుకోవాలి. విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. ట్విట్టర్లో ఆయన తిట్టని ప్రత్యర్థి అంటూ లేరు. ఉచ్చనీఛాలు మరిచి మరీ ట్విట్టర్ విమర్శలు చేయడం విజయసాయిరెడ్డి స్టైల్ . తనకు సంబంధంలేకపోయినా ఆయన ఇన్వాల్వ్ అవుతూంటారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను తిట్టనిదే ఆయనకు పొద్దు పోదు. అలాంటిది ఇప్పుడు ఆయన ట్విట్టర్లో అలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో విజయసాయిరెడ్డికి ఏమయింది అన్న చర్చ ప్రారంభమయింది.
మరో వైపు ఆయన వైజాగ్‌లోనూ కనిపించడం లేదు. కారణం ఏమిటో తెలియదు కానీ ఆయన వల్ల ఉత్తరాంధ్ర వైసీపీ అంతా భ్రష్టుపట్టిపోయిందని నాయకులంతా పార్టీని నమ్మే పరిస్థితి లేదన్న అంచనాలు రావడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పీకే టీంను రంగంలోకి దించారన్న ప్రచారం కూడా వైసీపీలో జరుగుతోంది. అదే సమయంలో ఢిల్లీలో ఆయనకు గతంలో ఇచ్చిన బాధ్యతలన్నీ ప్రస్తుతం మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించారు. ఇక విజయసాయిరెడ్డికి చేయడానికి పనులేం లేవు.
ఆయన సన్నిహితులపై ఇన్‌కంట్యాక్స్ వంటి సంస్థలు గురి పెట్టాయి. గతంలో రాంకీపై ఐటీదాడులు జరగగా తాజాగా హెటెరోలో సోదాలు జరిగాయి. అందులో ఏమి బయటపడతాయో తెలియదు కానీ విజయసాయిరెడ్డి హఠాత్తుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. మామూలుగా ఇలాంటి భేటీలు జరిగితే అసలు ఎజెండా ఏమున్నా కానీ తాను రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం కేంద్రమంత్రితో మాట్లాడానని మీడియాకు చెప్పేవారు. కానీ ఈ సారి నిర్మలమ్మతో మీటింగ్ రహస్యంగా సాగింది. ఇలా మీటింగ్ జరిగినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రినే ట్వీట్ చేయడంతో ఇక తప్పని సరి అన్నట్లుగా తాను కూడా రీట్వీట్ చేశారు.
ఒకప్పుడు వైసీపీలో తిరుగులేని స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని ఆ పార్టీ నేతలు చాలా పక్కాగా పక్కకు నెట్టేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయన వ్యవహారశైలిని జగన్ వద్ద తప్పుగా చిత్రీకరించి..ఎప్పుడు ఆయన పక్కన ఉండే కొంత మంది నేతలు ..తమ పలుకుబడి పెంచుకుని తిరుగులేని శక్తిగా మారారన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి విజయసాయిరెడ్డి జగన్‌తో పెరిగిన గ్యాప్ పూడ్చుకోలేనంతగా పెరిగిపోయిందన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.