ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరాకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే ఆ బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే బస్సులు ఒక వైపే ఫుల్‌గా తిరుగుతాయని ఇంకో వైపు ఖాళీగా రావాల్సి ఉంటుందని అందుకే.. యాభై శాతం అదనంగా వసూలు చేస్తున్నామని వివరణ ఇస్తున్నారు. నిజానికి ప్రతి ఏడాది దసరా సమయంలో లేదా ఇతర పండుగల సమయంలో ఆర్టీసీ బస్సులు ప్రత్యేక బస్సుల పేరుతో ఇలా దోపిడి చేయడం సహజమే. సాధారణ సర్వీసుల్ని నిలిపివేసి అన్నింటిని ప్రత్యేక సర్వీసులుగా మార్చేయడం కూడా సహజమే.
వీటిని చూసి ప్రైవేటు బస్ ఆపరేటర్లూఅదే చేస్తారు. అది వేరే విషయం. అయితే ప్రభుత్వం ఇలా డిమాండ్‌ను బట్టి యాభై శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం ఏమిటన్న విమర్శలు ఇప్పుడు తీవ్రంగా వస్తున్నాయి. దీనికి కారణం సినిమాల వివాదం. టిక్కెట్ రేట్లు పెంచుతున్నారని… ప్రత్యేకంగా రేట్లను తగ్గిస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం.. ప్రజలను దోచుకుంటున్నారని అందుకే కట్టడి చేశామని చెబుతోంది. కానీ అది ప్రజలకు అవసరం. పండుగలకు ఇంటికి వెళ్లాలని అందరూ అనుకుంటారు.
సినిమా అనేది వినోదం. వెళ్లాలనుకుంటే వెళ్తారు లేకపోతేలేదు. ప్రభుత్వం ప్రజల అవసరాల్ని గుర్తించి వాటి రేట్లను తగ్గించాలి కానీ .. ఇలా సినిమాల రేట్లను తగ్గించి… బస్ చార్జీలను పెంచడమేమిటన్నది సహజంగానే వచ్చే ప్రశ్న. ఇదేం వివక్ష అని సినిమా వాళ్లు అడగలేరు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా రేట్లు తగ్గిస్తారేమోనని భయం. ప్రజలు కూడా అడగరు. ఎందుకంటే ప్రశ్నిస్తే బస్ చార్జీలు ఇంకా పెంచుతారేమోనని భయం.