అమరావతి గురించి పదో తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న ఓ పాఠాన్ని విద్యా శాఖ తొలగించింది. కొత్త పుస్తకాలు పంపిణీ చేసింది. పాత పుస్తకాలను వెనక్కి పంపాలని స్కూళ్లను ఆదేశించింది. ఆ పాఠంలో అమరావతి పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. ఇది ప్రస్తుత పాలకులకు నచ్చలేదు. అందుకే తీసివేయించారు. కొత్తగా పాఠం చేర్చాలంటే సమయం పడుతుందనుకున్నారేమో కానీ.. మొత్తం పన్నెండు పాఠాలు ఉంటే.. అమరావతిని తగ్గించి పదకొండు పాఠాలతోనే బుక్స్ ముద్రించారు. ప్రభుత్వ నిర్ణయం విషయం తెలిసి అమరావతిపై ప్రభుత్వం విపక్ష చూపిస్తోందని ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించారు.
ఆ పాఠాన్ని ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమరావతిపై ప్రభుత్వం వివక్ష చూపించడం ఇప్పుడే కాదు రెండేళ్ల కిందటి నుంచే ఉంది. అమరావతి ఉనికే లేకుండా చేద్దామన్న నిర్ణయాలు ఎప్పటి నుండో తీసుకుంటున్నారు. ఆ విషయాలు కళ్లముందు ఉండనే ఉన్నాయి. అమరావతిలో ఏర్పాటయిన విద్యా సంస్థలకు అమరావతి అని పేరు పెట్టకుండా ఏపీ అని మార్పించారు. రెండు ప్రైవేటు యూనివర్శిటీలూ తమ పేర్లు మార్చుకున్నాయి.
ఎప్పట్నుంచో జరుగుతున్న అమరావతిపై వివక్ష ఇప్పుడు పాఠాల్లోకి కూడా వచ్చింది. అమరావతిని ప్రభుత్వం గుర్తించడానికి.. గుర్తించబడటానికి కూడా సిద్ధంగా లేదు. ఈ విషయంలో విమర్శలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తరచూ బయటపడే ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.