ప్రముఖ ఫార్మా కంపెనీ హెటెరో పై జరుగుతున్న ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. పదుల సంఖ్యలో బృందాలు హెటెరోకు సంబంధించిన ప్లాంట్లు, కార్యాలయాలు సహా ఏ చిన్న స్థలాన్నీ వదల కుండాసోదాలు చేస్తున్నారు. చివరికి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకు కొలతలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హెటెరో కార్పొరేట్ ఆఫీసులో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లుగా తెలుస్తోంది. కనీసం ఓ గది నిండా నోట్లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే.. మరో రెండు రోజుల పాటు సోదాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఐటీ దాడుల సందర్భంగా హెటెరో ఆఫీసులు, ప్లాంట్లలో ఓ రకమైన ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పన్ను ఎగవేత ఆరోణలపైనే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నప్పటికీ సోదాల్లో అంతకు మించిన అవకతవకలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన తర్వాతే ఐటీ అధికారులు తాము ఏం గుర్తించామో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో మేఘా, రాంకీ గ్రూపు సంస్థలపైనా ఇలాగే పెద్ద ఎత్తున సోదాలు చేశారు.
అయితే ఐటీ అధికారులు ఎప్పుడు సోదాలు చేసినా వివరాలు వెల్లడిస్తుంది కానీ కంపెనీ పేర్లు చెప్పదు. వేల కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించినట్లుగా పలుమార్లు ప్రకటనలు చేసింది కానీ.. కంపెనీల పేర్లు చెప్పలేదు. ఇప్పుడు కూడా హెటెరో పేరు చెప్పకుండా సోదాలు ముగిసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అప్పుడు ఎంత దొరికాయి.. ఎక్కడి నుంచి వచ్చాయన్నది తేలే అవకాశం ఉంది.