” రాజు ఎప్పుడు నీతి తప్పితే రాజ్యం అప్పుడు గతి తప్పుతుంది.. ఆ విషయం తెలుసుకోవడం ఎంత ఆలస్యమైతే అంత అరాచకం రాజ్యమేలుతుంది. అసలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు … ఏం చేసినా మూర్ఖంగా సమర్థించే అనుచరులు ఉన్నారని తేలికగా తీసుకున్న రోజున ఇక అస్థిత్వ పతనం ప్రారంభమవుతుంది”. అంగీకరించడానికి కాస్త కటువుగా ఉన్నా ప్రస్తుతం భారత్ ఇదే పరిస్థితిలో ఉంది. దేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న రెండు ప్రధాన సంఘటనలను.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వర్గం లాంటి అన్ని రకాల గంతల్ని తీసేసి..నిశ్చలంగా చూస్తే మనం ఎంత దిగజారిపోయామో అర్థం అవుతుంది..! తేరుకోవడానికి .. కోలుకోవడానికి కూడా మనం అందుకోలేనంత పాతాళానికి దిగజారిపోయామని అర్థం అవుతుంది..! ఈ పతనం ఇలాగే కొనసాగితే నాగరిక ప్రపంచంలో అనాగరిక దేశానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోతామని కూడా సులువుగానే అర్థం అవుతుంది.
మన దేశంలో రైతుల్ని అంత సులువుగా హత్య చేసేంత స్వాతంత్ర్యం వచ్చేసిందా?
ఓ తాగుబోతు రోడ్డు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తేనే .. అతనికి బతికే అర్హత లేదని నిందిస్తాం. కావాలని ఎవరైనా మనుషులపైకి కార్లను ఎక్కిస్తే ఏమనాలి..?. వాళ్లను రాక్షసుడు అనడం కూడా తక్కువే. అంత కంటే నీచ, నికృష్టమైన పదం ఏదైనా కనిపెట్టాలి. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై కార్ల కాన్వాయ్‌తో అలా తొక్కించుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు చూసిన వారికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ మనిషిని అంత ఈజీగా చంపగలిగే ధైర్యం వారికి ఎలా వచ్చింది..? అది మూడు కార్ల కాన్వాయ్. అందులో స్పష్టంగా వీఐపీ ఉన్నాడని తెలిసేలా కార్లకు అటూ ఇటూ వేలాడుతూ అనుచరులు కూడా ఉన్నారు. కావాలనే రైతుల మీద నుంచి కార్లను పోనిచ్చి హత్యలు చేయాలని అనుకున్నారు. చేశారు. నిందితుల్ని పట్టుకున్నారా లేదా.. అనేది తర్వాత విషాదం.. కానీ అంత ధైర్యం వారికి ఎలా వచ్చిందనేది ఇక్కడ అసలు సమస్య. అందులో కేంద్ర మంత్రి కొడుకు ఉన్నాడనేది బహిరంగరహస్యం . కానీ ఆయనను ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. కానీ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన వాళ్లందర్నీ అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ నిలిపివేశారు. ఇతర ఆందోళనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆ దారుణానికి పాల్పడిన వారు మాత్రం అధికారం అనే అండతో హాయిగా ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నారు.
కొట్టండి, చంపండి అని బహిరంగ హెచ్చరికలు చేసినప్పుడే ఆపలేకపోయారు.. ఇక చంపేసిన తర్వాత పట్టుకుంటారా ?
రైతులను అన్నదాతలు అనే పేరుతో పిలుస్తూంటారు. ఇక్కడ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా అంతే పిలుస్తూంటారు. ఆ అన్నదాతలు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పది నెలలుగా నిరసనలు చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్ని చేయాలో ఆన్ని చేశారు. హర్యానాముక్యమంత్రి ఖట్టర్ అయితే శివ సినిమాలో భవాని చెప్పినట్లుగా వెయ్యి మంది బృందంగా వెళ్లి రైతులకు కొట్టేసి రండి.. జైలుకు వెళ్తే పెద్ద నాయకులు అవుతారు..చరిత్రలో మీ పేరు రాస్తారు అని రెచ్చగొట్టిన విషయాలు కళ్ల ముందు ఉండనే ఉన్నాయి. ఇక నిన్నటి ఘోరానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కూడా పది రోజుల కిందటే అచ్చంగా ఇలాంటి హెచ్చరికలే చేశాడు. ఉద్యమిస్తున్న రైతులు తమ వైఖరి మార్చుకోకపోతే, కేవలం రెండునిముషాల్లో వారిని ఎలా దారికి తేవాలో తనకు తెలుసంటూ చేసిన ప్రసంగవీడియోల్లో రైతులను తన్నడం, తరిమికొట్టడం వంటి భాష విరివిగా ఉంది.బహుశా తన తండ్రి మాటల్లో చెప్పాడు అంటే తాను చేతల్లో చూపించాలని అనుకున్నట్లుగా ఉన్నాడు పుత్రరత్నం. అధికారం అప్పటికే నడి నెత్తికి ఎక్కినట్లుగా ఉంది. మనుషుల్ని చంపేసినా అడిగేవారుండరని ధీమా పెరిగిపోయింది. అధికారం తెచ్చిన అహంకారంతో దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలను పొట్టనపెట్టుకున్నారు.
ఘోరాలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ?
అధికార పీఠంపై ఉన్నాం కాబట్టి మేము రాజులం.. మాది రాచరికం ఎవరినైనా తొక్కేస్తాం, తొక్కించేస్తాం అన్నట్లుగా మనసులో పాతుకుపోయిన భావనకు ఆ ఘటన రక్త సాక్ష్యం. అంతకు ముందే హర్యానా లోని కర్ణాల్లో ఉద్యమిస్తున్న రైతుల తలలు బద్దలు కొట్టమని ఉన్నతాధికారి పోలీసులను ఆదేశించారు. రెచ్చిపోయిన పోలీసులు పాతికమంది రైతులను చావగొట్టారు, ఒకరిని చంపేశారు. అప్పుడే రచ్చ అయింది. కానీ అది వారి బాధే అయింది కానీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల బాధ కాలేదు. ఫలితంగా లఖింపూర్ వంటి ఘటనల వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై న్యాయవిచారణలో సంచలన విషయాలు బయటపడతాయని ఎవరూ ఆశలు పెట్టుకోలేరు. మరింత రక్తసిక్త శవరాజకీయాలకు పాలకులు పాల్పడతారన్నది నిజం. ఇక్కడే దేశానికి ముంచుకొచ్చిన అసలు ప్రమాదం కళ్ల ముంగిట కనిపిస్తుంది. మనుషుల్ని అడ్డగోలుగా చంపిన వారికీ అంతులేని రక్షణ లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశంలో అయినా చట్టం, న్యాయం ఉందని ఎవరైనా నమ్ముతారా ? అధికారం చేతిలో ఉన్న వాడికి ఏ చట్టాలు పని చేయవని తేలిన తర్వతా ఇక ఎక్కడైనా ప్రశాంతత ఉంటుందా ? .సంఘటన జరిగిన వెంటనే, బాధితులకు మాటవరస సానుభూతి అయినా చెప్పకుండా, ఖలిస్తాన్ తీవ్రవాదులు నిరసనకారులలో ఉన్నారని.. నిందితుడి తండ్రి అయిన కేంద్రమంత్రే ఎదురుదాడికి దిగారంటే ఇంక వారి తీరును విశ్లేషించడానికి ఏ కొలమానం కావాలి ? . ఇంత కంటే పెద్ద దారుణాలు, దుర్మార్గాలు ఈ ప్రభుత్వాల హయాంలో జరిగి ఉండవచ్చు. కానీ, రైతులను తొక్కించి చంపడం అన్నది రాక్షసత్వానికి పరాకాష్ట.లఖింపూర్ లాంటి ఘోరాలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ? ప్రాణాలకు ఖరీదు కట్టే నాయకుల దుష్టత్వం ఇంకెంత కాలం? . అంటే ఎవరూ చెప్పలేరు.
షారుఖ్ కుమారుడి డ్రగ్స్ కేసుతో దేశాన్ని తప్పుదారిలోకి మళ్లించేశారు !
ఈ ఘటనలో అరాచకం ఈ స్థాయిలో ఉంటే మరో వైపు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకును ట్రాప్ చేసి మరీ డ్రగ్స్ కేసులో ఇరికించినట్లుగా వస్తున్న వార్తలు మరింత దారుణం. దేశంలో లక్షల మంది డ్రగ్స్ బాధితులు ఉన్నారు. అందరిలో ఆర్యన్ ఖాన్ ఒకడు. దారి తప్పాడు. తల్లిదండ్రుల పెంపకమో.. డబ్బుతో వచ్చిన విలాసమో.. తను సూపర్ స్టార్ కొడుకునన్న అహమో కానీ.. ఎక్కడో తేలాలనుకున్నాడు. దానికి డ్రగ్స్ దారి ఎంచుకున్నాడని అనుకుందాం. అలాంటప్పుడు దొరికితే ఏం చేయాలి ?. ఏం చేయాలో కానీ ఇప్పుడు చేస్తున్నంతగా రచ్చ అయితే చేయకూడదు. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు.. అందరిలో ఒకటిగానే ఆలోచించాలి. కానీ ఆ కుర్రాడిపై ఎన్సీబీ పేరుతో చేస్తున్న ప్రచారం చేస్తున్న దేశంలో అందరికీ అసహ్యం పుట్టుకొస్తోంది. అసలు ఆ నౌకలో డ్రగ్స్ వాడారో లేదో తెలియదు.. ఎన్సీబీ అధికారులే డ్రగ్స్ పెట్టారని ఆర్యన్‌తో పాటు దొరికిన అతని మిత్రుల తరపు లాయర్లు వాదిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ బయట పెట్టాలని అంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఎన్సీబీ అధికారుల బృందంలో బీజేపీ నేతలూ కనిపించారు. ఇప్పుడు ఆర్యన్ నిజంగా డ్రగ్స్ వాడాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ అతన్ని మాత్రం ఓ టూల్‌గా వాడుకుని దేశం మొత్తం దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారని సులువుగానే అర్థమవుతుంది. షారుక్ కొడుకు నిజంగానే తప్పు చేసి ఉండవచ్చు.. కానీ ఇలా అడ్డగోలు ప్రచారాలతో ఎందుకు ఇలా హడావుడి చేస్తున్నారో కొంత మందికి తెలుసు.
న్యాయం జరుగుతుందన్న నమ్మకం దేశంలో ఎవరికీ లేదు ! ఎందుకీ పరిస్థితి ?
ఓ వైపు మనుషుల్ని అడ్డగోలుగా చంపేసిన వాళ్లు … కార్లతో తొక్కించిన వాళ్లు హాయిగా ఉన్నారు. మరో వైపు నేరం చేశాడో లేదో కానీ డ్రగ్స్ బారిన పడిన ఓ భవిష్యత్ ఉన్న కుర్రాడ్ని అంతర్జాతీయ డాన్‌గా ప్రొజెక్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంచి చెడులు విశ్లేషించుకోవాల్సిన సమాజం కూడా .. మీడియా, సోషల్ మీడియా మాయలో పడి విచక్షణ కోల్పోయింది. రైతుల్ని అడ్డగోలుగా చంపేసినా .. తప్పు రైతులదే అని వాదించే వారూ పుట్టుకొచ్చారు. దేశంలో అన్ని సమస్యలు ఉన్నా.. షారుఖ్ కొడుకు డ్రగ్స్ వ్యవహారమే అసలు సమస్య అన్నట్లుగా వెంపర్లాడిపోయే ఉన్మాద దేశభక్తులకూ కొదవ లేదు. తప్పు వాళ్లది కాదు. కానీ.. ప్రజల్ని ఇంత సులువుగా ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి ..తాము అడ్డగోలుగా హత్యలు చేసినా సమర్థించే వారిని సృష్టించుకున్న రాజకీయానిది అసలు తప్పు. దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుని చిన్న చిన్న చేపల్ని పట్టుకుని అదే అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించినా .. అదే కరెక్టని వాదించే నయా తెలివి సొంతం చేసుకున్న ఆధునాతన పౌరులదే తప్పు. ఈ తప్పులు ఎప్పటికి తెలుసుకుంటారో అప్పుడే భారత భవిష్యత్ ఊబి నుంచి బయటకు రావడం ప్రారంభమవుతుంది.
ప్రజలు మేలుకోకపోతే అరాచకం అంచునకు భారత్ చేరుకున్నట్లే !
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేసినా.. ఏం చేసినా తప్పు లేదనే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది. ఆందోళన చేసే వారిని చంపేసినా చంపేసినా పర్వాలేదనే దుస్థితికి ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయి. మరో వైపు చిన్న నేరాల్ని చిలువలు పలువలుగా ప్రచారం చేసి దేశం దృష్టి మళ్లించే ప్రయత్నాలకూ మద్దతు లభిస్తోంది. ఇదంతా మన కళ్ల ముందే జరుగుతోంది. కనిపిస్తోంది. కానీ ఎంత మంది ప్రజలు వీటిపై అవగాహనతో ఉన్నారు..? కులం, మతం, ప్రాంతం, రాజకీయం లాంటి విషపు అడ్డుగోడల్ని చేధించుకుని ఎంత మంది నిజాలను చూడగలుగుతున్నారు..?. ఇలా దేశంలోని మెజార్టీ ప్రజలు చూడగలిగినప్పుడే …. ఊబి నుంచి దేశం బయటపడుతుంది. ప్రజలకు బయటపడతారు. లేకపోతే ఏం జరుగుతుందో ఊహించడం భయంకరం.