డ్రగ్స్ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారని.. వాటికి సాక్ష్యాలివ్వాలంటూ కాకినాడ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లారు. నోటీసులు ఇవ్వడానికే వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలో ఉన్న ఆయన ఇంటికి పోలీసులు ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడానికే వెళ్లారు. ఒక వేళ ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలకు సాక్ష్యాలివ్వకపోతే .. గతంలో అరెస్ట్ చేసినట్లుగా తెల్లవారు జామునే వచ్చి అరెస్ట్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి.
రాజకీయ నేతలు అనేక రకాలుగా ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేష్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటిని పట్టుకుని పోలీసులు నేరుగా ఎందుకు రంగంలోకి దిగుతున్నారో రాజకీయ పార్టీల నేతలకూ అర్థం కాని పరిస్థితి. అయితే ఇలా పోలీసులు సాక్ష్యాలు కావాలని నోటీసులు జారీ చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేశారు. చేసిన ఆరోపణలకు సాక్ష్యాలతో సహా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల తీరు మరీ గీత దాటినట్లుగా ఉండటంతో గతం నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజల కోసం కాకుండా రాజకీయ పార్టీల తరపున పని చేస్తున్నట్లుగా వారి తీరు ఉంటోందన్న ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. న్యాయస్థానాల్లో ఎన్నో సార్లు మొట్టికాయలు వేయించుకున్నా.. రాజకీయంగా ఆరోపణలు చేయకుండా విపక్ష నేతల్ని నిలువరించేందుకు తమ అధికారాన్ని వాడుకుంటున్నారన్నఅభిప్రాయం వారిపై బలపడుతోంది.