ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రం అని ఇప్పటి వరకూ అందరికీ తెలుసు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఏపీ విద్యుత్ సంక్షోబంలో చిక్కుకుపోయిందని.. తక్షణం ఆదుకోవాలని ఆ లేక సారాంశం. ఏపీలోని 2,300 మెగావాట్ల గ్యాస్ విద్యుత్ ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ఏపీలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోందని దానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఉండటం లేదన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేర విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని ప్రధానికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఉన్న ఒప్పందాలను వినియోగించుకోలేకపోతున్నామని దీని వల్ల ప్రతి రోజూ 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండగా.. దాని ధర ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 వరకు సగటున యూనిట్ రూ.4.6 ఉండగా, అక్టోబర్ 8 నాటికి రూ.15కు చేరిందని కొన్ని సందర్భాల్లో విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తోందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏం చేయాలో కూడా లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చారు. ఏపీలోని విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్‌ను కేటాయించాలని కోరారు. బొగ్గు గనులకు సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు పని చేయడం లేదని వాటి సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో పని చేసేలా చూడాలన్నారు. కేంద్ర ఉత్పత్తి సంస్థలను నిర్వహణ కోసం నిలిపి వేశారని.. తక్షణం పునరుద్ధరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కాలంలో కరెంట్ కోతలకు.. వాతలకు సూచనగా ఎక్కువ మంది భావిస్తున్నారు. అధిక ధరను పెట్టి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామంటే ఆ భారం ప్రజలపై వేయడానికేననని భావిస్తున్నారు.