ఆర్.ఎక్స్ 100తో తన సత్తా చాటుకున్నాడు అజయ్ భూపతి. ఆ సినిమా మూడేళ్లయిపోయింది. ఇన్నాళ్లకు అజయ్ భూపతి నుంచి మరో సినిమా వస్తోంది. అదే.. `మహా సముద్రం`. శర్వానంద్, సిద్దార్థ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఈ నెల 14న విడుదల అవుతోంది. ఇది వరకే ట్రైలర్ ని చూపించారు. కానీ ఇప్పుడు మరో కొత్త ట్రైలర్ వచ్చింది. దాదాపు 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ పవర్ ప్యాక్డ్గా కట్ చేశారు.
”భుజాల మీదున్న బరువుని బలమున్నవాడెవడైనా మోస్తాడు
కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినవాడొక్కడే మోయగలడు
ఆ బంధం.. ప్రేమైనా.. స్నేహమైనా” అనే శర్వా డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
”ఓ చంప మీద కొడితే మరో చంప చూపించడానికి నేనేమైనా గాంధీ ఫాలోవర్ని అనుకున్నావురా.. భగత్ సింగ్ ఫాలోవర్ని” అంటూ శర్వానంద్ క్యారెక్టరైజేషన్ ని ఒక్క డైలాగ్ తో చెప్పేశాడు అజయ్ భూపతి.
అర్జున్, శివ అనే ఇద్దరు స్నేహితులు, ఓ అమ్మాయి వల్ల శత్రువులుగా ఎలా మారారన్నది ఈ సినిమా కథేమో అనిపిస్తోంది. మహా అనే అమ్మాయి కథ ఇది. తనెవరిని ప్రేమించింది? తన ప్రేమ వల్ల ఇద్దరూ శత్రువులుగా ఎలా మారారు అనేది ఆసక్తికరం.
”గుర్తు పెట్టుకో అర్జున్ … నిన్ను చంపకుండా ఈ వైజాగ్ వదిలేసే ప్రసక్తే లేదు” అని సిద్దార్థ్ వార్నింగ్ ఇస్తే….
”యముడు పెట్టిన ముహూర్తం కన్నా, ఒక్క నిమిషం ముందే చంపేస్తాను” అని తిప్పికొట్టాడు. అటు శర్వా, ఇటు సిద్దార్థ్ పాత్రలు రెండూ పోటా పోటీగానే డిజైన్ చేశాడన్న విషయం ట్రైలర్లోనే అర్థమవుతోంది. విశాఖ చుట్టూ నడిచే కథ ఇది. జగపతిబాబు, రావు రమేష్ పాత్రల్ని సైతం బలంగానే రాసుకున్నాడు అజయ్ భూపతి. ఒక్కో పాత్రకూ ఒక్కో క్యారెక్టరైజేషన్, మేనరిజం ఇచ్చేశాడు. మొత్తానికి ఈ సీజన్లో విడుదల అవుతున్న సినిమాల మధ్య, అందరి దృష్టీ మహా సముద్రం వైపుకు తిప్పుకునేలా ఈ ట్రైలర్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.