హుజురాబాద్‌లో మొదటి నుంచి ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. చివరికి ఆయనను బీజేపీలోకి తీసుకు రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన వివేక్ వెంకటస్వామి సహా అందరూ అంటీముట్టనట్లుగానే ఉన్నారు. నామినేషన్ రోజున బండి సంజయ్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక తర్వాత ప్రచార వ్యూహంపై అందరూ క్లూ లెస్ గా ఉన్నారు. ముఖ్య నేతల్ని తీసుకొచ్చి ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.
ఇప్పటికే పలువురు నేతలకు మండలాలు, గ్రామాల వారీగా ఇంచార్జ్‌ల బాధ్యతలు ఇచ్చారు. కానీ వారెవరూ సీరియస్‌గా బరిలోకి దిగినట్లుగా లేదు. పోలింగ్ కేంద్రాలవారీగా సీనియర్ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాసని భావిస్తున్నారు. ఇలా చేయాలంటే బండి సంజయ్ నేతృత్వంలోనే జరగాలి. దసరా అయిపోయిన తర్వాత చూద్దామని బండి సంజయ్ తేల్చేసినట్లుగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా బహిరంగసభలు, ర్యాలీలను ఈసీ నిషేధించింది. అయితే బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దీక్షను సంజయ్ ప్రారంభించారు. ఆ తర్వాతే మళ్లీ హుజురాబాద్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది.
పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికీ బీజేపీకి సరైన కార్యాచరణ లేకుండా పోయింది. వీలైనంత వరకూ ఈటల తన సొంత బలంపైనే ఆదారడుతున్నారు . మరో వైపు టీఆర్ఎస్ ప్రతి వంద మంది ఓటర్లకో ప్రతినిధిని పెట్టేసి ప్రచారం చేస్తోంది. హరీష్ రావు అక్కడే మకాం వేసి ఎలక్షనీరింగ్ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు ప్రచారానికి రాకపోతే ఈ ఎన్నికలపై ఢిల్లీ నేతలకు ఆసక్తి లేదన్న అభిప్రాయం బలపడుతుంది. అది ఈటలకు మైనస్ అయ్యే అవకాశం ఉంది.