జనసేన పార్టీకి రాజకీయం చేయడంలో ఇప్పటికీ గందరగోళ పరిస్థితినే ఎదుర్కొంటోంది. దివంగత ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టినందున తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే మిత్రపక్షం బీజేపీతో సమన్వయం చేసుకోలేదు. తమ నిర్ణయం తాము ప్రకటించారు. మిత్రపక్షం జనసేన నిర్ణయాన్ని ఆమోదించడానికి బీజేపీ అంగీకరించలేదు. అభ్యర్థిని నిలబెట్టింది.
పవన్ కల్యాణ్ మద్దతు అడుగుతామని సోము వీర్రాజు ప్రకటించారు. ఇప్పుడు పవన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం కష్టమే కానీ.. పవన్ తర్వాత జనసేనలో పెద్ద లీడర్‌గా పేరున్న నాదెండ్ల మనోహర్ మాత్రం బీజేపీ అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. బీజేపీతో కలిసే ఉన్నామని విడిపోలేదని చెప్పుకొచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకు మద్దతుగానే ఎన్నికల నుంచి విరమించుకున్నామని ప్రకటించిన తర్వాత జనసేన బీజేపీ అభ్యర్థికి ఎలా సహకరిస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం. రాజకీయ విధానాల్లో క్లారిటీ లేకపోవడం వల్లే జనసేనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి.
అయినా గుర్తించలేకపోతున్నారు. ఇలా మద్దతు ఇచ్చే పని అయితే.. మీరే పోటీ చేయండి అని ముందుగానే బీజేపీకి ఓ మాట చెప్పి ఉంటే సరిపోయేది. కానీ నాదెండ్ల మనోహన్ చేసిన సహకారం ప్రకటన వల్ల ఎందుకు ఉపఎన్నిక నుంచి వైదొలిగారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి గందరగోళ నిర్ణయాలను జనసేన వదిలి పెట్టనంత కాలం గడ్డు పరిస్థితే ఉంటుందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.