‘మా’ ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడెవరో తెలిసిపోయింది. అయినా `మా` రాజకీయాల్లో మాత్రం వాడీ వేడీ తగ్గలేదు. ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే `మా` సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేసి, అందరికీ షాక్ ఇచ్చారు. ”ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో షనాష ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించారు.
ఈ ఎన్నికలలో మెగా మద్దతుతోనే ప్రకాష్ రాజ్ పోటీకి దిగిన సంగతి తెలిసిందే. నాగబాబు కూడా `మా సపోర్ట్ తనకే` అని బహిరంగంగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ గెలుపుకోసం శ్రమిస్తా.. అని మాట ఇచ్చారు. ఓరకంగా.. ప్రకాష్ రాజ్ ఓటమి, తన ఓటమిగా భావించి, ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు. మరోవైపు.. ప్రకాష్ రాజ్ని స్థానిక వాదం, ప్రాంతీయ వాదం ఓడించాయి. తన ఓటమిలో.. ప్రాంతీయత కీలకమైన పాత్ర పోషించింది. `మా`లో ప్రాంతీయ వాదం నచ్చలేదంటూ నాగబాబు రాజీనామా చేయడం – `మా`లోని సంకుచిత రాజకీయ వాదాన్ని నాగబాబు వేలెత్తి చూపించినట్టైంది. ఓసారి `మా` అధ్యక్షుడిగా పనిచేసి, `మా`లో పలుకీలకమైన బాధ్యతలు నిర్వహించి, మా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాగబాబు ఇప్పుడు `మా`ని వదిలేయడం – షాకింగ్ విషయమే.