ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడానికి తెలంగాణ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీని రద్దు చేస్తూ తాజా ఆర్టీసీ ఉన్నతాధికారి సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరైనా యాభై శాతం ఎక్కువ చెల్లించి ఉంటే వారికి రీఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి కారణం ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో టిక్కెట్లు చాలా మిగిలిపోయాయి. ఇలా అయితే కష్టమని ఆలోచించారు.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో టిక్కెట్ రేట్లను యాభై శాతానికి పెంచారు. దీంతో ఆ బస్సుల ప్రయాణికుల్ని తమ వైపు రప్పించాలంటే టిక్కెట్ రేట్ల తగ్గింపే మార్గం అనుకుని ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీని రద్దు చేశారు. ఇప్పుడు ఏపీ ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా క్యాన్సిల్ చేసుకుని.. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోటిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. తెలంగాణ బస్సుల్లో టిక్కెట్లు మిగిలిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే .. తెలంగాణ కూడా అన్ని బస్సులను ఏపీకి నడుపుకోవచ్చు.
కరోనా లాక్ డౌన్ తర్వాత ఏపీ బస్సులను తెలంగాణలోకి అనుమతించలేదు. ప్రత్యేక ఒప్పందం ఉండాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. దానికి ప్రకారం తెలంగాణలో ఏపీ ఎన్ని సర్వీసులు నడిపిస్తే.. తాము కూడా అన్ని నడుపుతామని ఒప్పందం చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ తో పాటు కర్నూలు టు హైదరాబాద్ రూట్లోనూ ఈ బస్సులు నడుస్తాయి. అంటే గతంలో ఏపీ ఆర్టీసీ బస్సులే విజయవాడకు 90 శాతం వెళ్లేవి. ఇప్పుడు యాభై శాతం అయ్యాయి. మిగిలిన యాభై శాతం టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తున్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే కోటా. ఏపీ ఆర్టీసీ రేటు పెంచినా తెలంగాణ పెంచకుండా ఆ రద్దీని తాను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించడం ప్రారంభించింది.