జనసేన అధినేత రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఆయన మేధావులతోనే ఎక్కువగా చర్చిస్తూంటారు . టీడీపీ హయాంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంపై డాక్టర్ జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండి ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి వాటిని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ట్రెండ్‌కు తగ్గట్లుగా టాపిక్ మారిపోయింది. ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్క తేలింది. కానీ పైసా కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ లెక్కలు చూడటం దండగనుకున్నారేమో కానీ.. అసలు ఏపీ ఆర్థిక లెక్కలు చూడాలనుకుంటున్నారు.
గత కొద్ది రోజులుగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై పవన్ కల్యాణ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని ఒక సారి.. దివాలాదిశగా ఏపీఆర్థిక పరిస్థితి అని మరోసారి లెక్కలు వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్మీట్లో చెప్పిన లెక్కలను వివరించారు. ఉండవల్లి పేరు చెప్పకపోయినప్పటికీ ఏపీలో రూ.6 లక్షల కోట్ల అప్పులు, మరో రూ.50 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతున్నారని పేర్కొన్నారు. అసలు ఎందుకీ దుస్థితి అంటూ ట్వీట్ చేశారు.
అందుకే ఏపీ ఆర్థిక పరిస్థితిపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. వైసీపీ సహా కాపా సహా అన్ని రాజకీయ పక్షాలు అలాగే ఉండవల్లి అరుణ్‌కుమార్, జస్టిస్ లక్ష్మణరెడ్డి, విశ్రాంత ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి, హోంశాఖ విశ్రాంత కార్యదర్శి కె. పద్మనాభయ్య, విశ్రాంత ఐఏఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, శర్మ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు, రైతు, ప్రభుత్వ, ప్రైవేటు, ఉద్యోగ, కార్మిక, సచివాలయ, ప్రజా సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరుకంటున్నారు.
అయితే గతంలో టీడీపీ హయాంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు జగన్ సర్కార్‌ను ప్రశ్నించడానికి ఆ మేధావులు ముందుకు వస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే రాజకీయ పార్టీలకు తగ్గట్లుగా మేధావుల అభిప్రాయాలు.. ప్రకటనలు మారిపోతూంటాయి.