శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు. దర్శకత్వంలో ఆయనకు తిరుగులేదు. స్టార్లందరి కెరీర్లో మర్చిపోలేని హిట్లు అందించారాయన. అయితే ఈమధ్య నటనపై దృష్టి మళ్లింది. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చారాయన. ‘పెళ్లి సందD’లో ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల అవుతోంది.
నిజానికి ‘పెళ్లి సందD’ కంటే ముందే.. రాఘవేంద్రరావుకి నటుడిగా ఓ ఆఫర్ వచ్చింది. అదీ దిల్ రాజు నుంచి. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చి, సూపర్ హిట్టయిన సినిమా `శతమానం భవతి`. ఈసినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రకు గానూ మొదటి ఆప్షన్… రాఘవేంద్రరావునే అట. ఆ పాత్ర కోసం రాఘవేంద్రరావుని సంప్రదిస్తే ఆయన ససేమీరా అన్నార్ట. అందుకే.. ప్రకాష్ రాజ్ ని తీసుకోవాల్సివచ్చింది. ఈ విషయాన్ని దిల్ రాజునే స్వయంగా తెలిపారు.
”నిర్మాతగా 50 సినిమాలు చేసినా, ఒక్క సినిమా కూడా రాఘవేంద్రరావుగారితో చేయలేకపోయా. ఆ లోటు తీర్చుకోవడానికి శతమానం భవతిలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్ర కోసం ఆయన్ని ఎంచుకుందాం అనుకున్నాం. కానీ ఆయన ఒప్పుకోలేదు. కాకపోతే ఈ సినిమా ద్వారా ఆయన్ని తెరపై చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. కథల విషయంలో ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలూ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నిర్మాతగా నా విజయాలకు ఆయన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.