ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కరెంట్ కోతలకు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు.. అన్ని శాఖల తరపునా ప్రకటనలు చేసే సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు కరెంట్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఏసీల్లాంటి వాటిని వినియోగించడం ఆపేయాలన్నారు. కరెంట్ కొనడానికి కూడా దొరకడం లేదని.. ఇప్పుడు యూనిట్‌కు రూ. ఇరవై పెట్టి కొంటున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కరెంట్ వాడకం తగ్గించం మినహా మరో ఉపాయం లేదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని.. ఈ సమస్యపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని సజ్జల చెప్పుకొచ్చారు. కరెంట్ సంక్షోభం ముంచుకొచ్చే వరకూ ప్రభుత్వం ఏం చేస్తుందో కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ కోతలు ఖాయమని చెప్పడం మాత్రం ప్రజలకు ముంచుకు రానున్న కష్టాలు గుర్తుకు తెచ్చేలాఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో వాతావరణ పరిస్థితి కారణంగా విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు ఉన్న వారంతా వాడేస్తున్నారు.
ఈ డిమాండ్‌ను అందుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. అవసరమైన దాంట్లో సగం మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు. మిగతా మొత్తం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు కరెంట్ కోతలకు సిద్ధం కావాలంటూ సజ్జల ప్రకటించడం ప్రజలకు ముందు ముందు రానున్న కష్టాలను కళ్ల ముందు కనిపించేలా చేస్తోంది.