ప్రత్యక్ష ఎన్నిక అయిన హుజారాబాద్కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పెండింగ్లో పడిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలెప్పుడు అని టీఆర్ఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. శాసనమండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీకాలం పూర్తైంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. అయితే కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. ఇటీవల ఎన్నికలు ఇప్పుడే వద్దని తెలంగాణ సర్కార్ ఈసీకి కూడాలేఖ రాసింది. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు నిర్వహిస్తూండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పెడతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు తమ ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్కు పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. కేసీఆర్ పట్టుబడతారా లేకపోతే.. కౌశిక్ రెడ్డికి షాక్ ఇస్తారా అన్నది వేచి ఆసక్తికరంగా మారింది.
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ భారీగా ఉంది. సీఎం పలు జిల్లాలకు చెందిన నేతలకు ఎన్నికల సమయంలో పదుల సంఖ్యలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో వారు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. పదువుల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవీకాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. అప్పుడు మరికొంత మందికి అవకాశాలు ఇస్తామని కొంత మందిని బుజ్జగించే అవకాశం ఉంది.