దిశ నిందితుల ఎన్ కౌంటర్ క్రెడిట్‌ను పొందిన నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ .. ఇప్పుడు అసలు తనకేమీ సంబంధం లేదంటున్నారు. తొలి సారిగా ఆయన దిశ నిందితల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. తనకేమీ తెలియదని అంతా శంషాబాద్ డీసీపీ చేశారని చెప్పుకొచ్చారు. తన అమాయకత్వాన్ని నిరూపించుకునేందుకు తనకు తెలుగు సరిగ్గా రాదని కూడా వాదించారు. జస్టిస్ సిర్ఫూర్కర్ కమిషన్ సజ్జనార్‌ను కీలకమైన అంశాలపై ఆరా తీసింది.
ఎన్ కౌంటర్ జరిగిన తర్వాతనే తనకు తెలిసిందని.. అలా జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించానన్నారు. అయితే చేశారో లేదో స్పష్టత ఇవ్వలేదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటని సజ్జనార్‌ను సిర్ఫూర్కర్ కమిషన్ ప్రశ్నించింది.. తనకు తెలియదని.. తాను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌ను కాదని ఆయన జవాబిచ్చారు. అన్ని అంశాలకు డీసీపీనే చెప్పారని చెప్పడంతో ఆయనపైనే ఆధారపడతారా అని కమిషన్ ప్రశ్నించింది. దానికి తాను అధికారులకు స్వేచ్చనిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎన్కౌంటర్ ప్రాంతంలో విచారణ ముగియక ముందే మీడియా సమావేశం నిర్వహించడం వల్ల విచారణ సరిగా చేయలేకపోయామనిని సాక్షులు చెప్పారని. అలాఎందుకు చేశారని ప్రశ్నించారు. మీడియా సమావేశాన్ని దూరంగా ఏర్పాటు చేశామని సజ్జనార్ వివరించారు. వెపన్స్ స్వాధీనంచేసుకోకుండానే ఎలా మీడియా సమావేశం పెట్టారని ప్రశ్నిస్తే.. తనకు డీసీపీ చెప్పారని కవర్ చేసుకున్నారు. మీడియా సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లను షాద్ నగర్ పోలీసులు చేశారని.. ఎలా తెచ్చారో తనకు తెలియదన్నారు.