‘మా’కి పోటీగా మరో సంస్థ ఏర్పాటు చేయబోతున్నారని `ఆత్మ` (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పేరుతో ఓ సంస్థని స్థాపిస్తున్నారని ఈరోజుంతా వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే `సినిమా బిడ్డలం` ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అయితే కొత్త అసోసియేషన్ విషయంలో ప్రకాష్ రాజ్ సముఖంగా లేరు. `ఆత్మ, ప్రేతాత్మల్లాంటివేవో వస్తున్నాయని వార్తలు వచ్చాయి. అదేం లేదు` అని క్లారిటీగా చెప్పేశారు. రాజీనామా చేసేది.. విష్ఱుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కోసమే అని, `మా` సభ్యుల కోసం, వాళ్ల అభివృద్ధి, శ్రేయస్సు కోసమే అని, బయట ఉండి కూడా పని చేస్తానని చెప్పుకొచ్చారు.
‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం కూడా ఈ ప్రెస్ మీట్లో ప్రస్తావనకు వచ్చింది. “మా ప్రాధమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేశా. కానీ విష్ణు ఒప్పుకోలేదు. నేను నా రాజీనామాని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ ఒకే ఒక్క షరతు. తెలుగువాడు కాకపోయినా, మా సభ్యుడైతే చాలు.. పోటీ చేయడానికి అర్హుడే. ఈ నిబంధనని బై లాస్ లో మార్చకుండా ఉంటానంటే నేను `మా` సభ్యుడిగా ఉండడానికి సిద్ధం“ అంటూ ప్రకటించారు.