తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన రూ. 200 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను సాయికుమార్ అనే వ్యక్తి అదే పనిగా విత్ డ్రా చేసుకున్నాడు. ఇది గత పది.. పన్నెండేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. ప్రభుత్వానికి చెందిన డబ్బులను ఇంత ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చా అన్న ఆశ్చర్యం ప్రజలకు కలుగుతోంది. ఇటీవల తెలుగు అకాడమీలో దాదాపుగా రూ. 70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. వాటిపై విచారణ జరిపిన పోలీసులు సాయికుమార్ అనే బ్యాంక్ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేసిన ఘన కార్యాలన్నీ బయటకు వచ్చాయి. కొల్లగొట్టింది వందల కోట్లలోనే ఉందని తేలింది.
ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్లకు సంబంధించిన రూ.15 కోట్లను ఇప్పటికే కొట్టేశారట. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థ ల నుంచి డబ్బులు కోట్టేసింది సాయి కుమార్ ముఠా. దాదాపుగా రూ. పదిహేను కోట్లు విత్ డ్రా చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను ఏపీ అధికారులకు పంపారు సీసీఎస్ పోలీసులు. దీంతో అక్కడి అధికారులకూ లైట్ వెలిగింది. ఇంకా ఎన్నెన్ని చోట్ల నుంచి ఈ నగదు విత్ డ్రా చేసుకున్నారన్న లెక్కలు తీయడం ప్రారంభించారు
ప్రభుత్వ నిధులు ఇలా విత్ డ్రా చేసుకోవడం ఇంత సులువా అన్న ఆశ్చర్యం ప్రస్తుతం సాయికుమార్ గ్యాంగ్ చేసిన నిర్వాకాల వల్ల తెలుస్తోంది. అయితే వీరికి పై స్థాయిలో పరిచయాలు లేకుండా కోట్లకు కోట్లు కొట్టేయడం సాధ్యం కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. కింది స్థాయి వ్యక్తులు.. ఓ చిన్న ముఠాగా ఏర్పడి… ఫిక్స్డ్ డిపాజిట్ల సమచారం తెలుసుకుని విత్ డ్రా చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ మొత్తం స్కాం వెనుక బడా మనుషులు ఉండే ఉంటారు. వారిని పోలీసులు బయటకు తీసుకు రావాల్సి ఉంది. లేకపోతే ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి.