విద్యుత్ కోతలు విధించి మరీ కొన్ని రాష్ట్రాలు, మిగులు విద్యుత్‌ను మరికొన్ని రాష్ట్రాలు పవర్ ఎక్స్ఛేంజీలలో అమ్ముకుంటున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసి ఒక్క రోజు గడవక ముందే…అలా అమ్ముతోంది తెలంగాణేనని బయటకు వచ్చింది. అత్యంత పీక్ టైంలో తెలంగాణ ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీలో రెండు రోజుల్లో 49 మిలియన్ యూనిట్లు అమ్మేసిందట. ఆ టైంలో ఒక్కో యూనిట్ ధర రూ. ఇరవై వరకూ ఉంది.
దేశంలో విద్యుత్ సంక్షోభం లాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో చాలా రాష్ట్రాలు బొగ్గు కొరతతో అల్లాడిపోతున్నాయి. అయితే తెలంగాణలో సింగరేణి ఉండటంతో బొగ్గు కొరతకు అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు కావాల్సినంత కరెంట్ ఇచ్చి మిగతా మొత్తాన్ని అమ్మేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు అమ్ముకోవద్దని అవసరం ఉన్నరాష్ట్రాలకు పంపిణీ చేయాలని మంగళవారం ఆదేశించింది. కొన్ని రాష్ట్రాలు ప్రజలకు కోతలు విధించి మరీ అమ్ముతున్నాయని.. ఇలా చేస్తే కేంద్రం వద్ద ఉన్న మిగులు విద్యుత్‌ను కేటాయించబోమని హెచ్చరించింది. అయితే కేంద్రం ఈ ఆదేశాలు ఇవ్వక ముందే తెలంగాణ అమ్ముతోంది. ఇప్పుడు తెలంగాణ అమ్మకాలను నిలిపివేస్తుందో లేకపోతే.. ఆదాయ మార్గానికి ఇదే మంచి సమయం అని కంటిన్యూ అవుతుందో చూడాలి.