తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25వ తేదీన జరగనుంది. పార్టీ విధానం ప్రకారం ప్రతి రెండేళ్లకు ఓ సారి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తూ వస్తున్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా వ్యాప్తి కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు. ఈ సారి కరోనా పరిస్థితుల కారణంగా హైటెక్స్‌లో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారు. వీరు దాదాపుగా 14వేల మంది ఉంటారని అంచనా.
అందరూ కలిసి అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నారు. అయితే సహజంగా ప్రక్రియ ఏకగ్రీవం అవుతుంది.కేసీఆర్ తప్ప మరో పేరు వినిపించదు. కానీ ఈ సారి కేటీఆర్‌ను అధ్యక్షుడ్ని చేస్తారా అన్న చర్చలు తెలంగాణ భవన్‌లోనూ… అటు బయట కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కేసీఆర్ ఆలోచనలేమిటన్నదానిపై ఎవరికీ క్లారిటీ ఉండదు. అందుకే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకూ చర్చ జరుగుంది. 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కేటీఆర్ నామినేషన్ దాఖలు చేస్తే ఆయనే అధ్యక్షుడు అనుకోవాలి.
టీఆర్ఎస్కు 12,769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3,600 పైగా వార్డు కమిటీలు ఉన్నాయి. వీటితో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల, పట్టణ కమిటీలను పూర్తి చేశారు. నవంబర్‌లో వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్‌కు ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలుంటే మాత్రం బ్యాటన్‌ను కుమారుడికి అప్పగించే అవకాశం ఉంది. లేకపోతే కేసీఆరే ఆధ్యక్షుడవుతారు.