వన్ సైడ్ అవ్వాల్సిన మ్యాచ్ – నరాలు తెంచే ఉత్కంఠ భరితంగా మారిపోయింది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ని పీకల మీదకు తెచ్చుకునేలా చేసింది కొలకొత్తా. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. 5వ బంతికి సిక్స్ కొట్టి.. కొలకొత్తాని ఫైనల్ చేర్చాడు త్రిపాఠీ.
ఈరోజు జరిగిన చివరి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగులు చేస్తే.. కొలకొత్తా ఫైనల్ చేరుతుంది. కొలకొత్తా బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ… ఛేజ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే చివర్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. నాలుగు ఓవర్ల వ్యవధిలో ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది కొలకొత్తా. చివరి ఓవర్లో 7 పరుగుగులు కావాలి. ఆఖరి ఓవర్లో బౌలింగ్ కి దిగిన అశ్విన్…. తొలి నాలుగు బంతుల్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సివచ్చింది. 5వ బంతిని త్రిపాఠి సిక్సర్ గా మలిచి, కొలకొత్తాని ఫైనల్ కి చేర్చాడు. శుక్రవారం జరిగే ఫైనల్ లో కొలకొత్తా చెన్నైతో తలపడబోతోంది.