ఒకటో తేదీ వస్తే జీతాలివ్వడం సహజం. కానీ ఒకటో తేదీనే ఇస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇవ్వడం.. వారు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అంటే అసాధారణ విషయమే. ఏపీ ఉద్యోగ సంఘాల పరిస్థితి ఇదే. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇటీవల ప్రెస్మీట్లు పెడుతున్న నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని ఇక నుంచి ఫస్ట్ ప్రయారిటీగా జీతాలు తీసుకుంటామని సజ్జల వారికి హామీ ఇచ్చారు.
ఫస్ట్ ప్రయారిటీ అంటే.. ఇప్పటి వరకూ నెలాఖరు వరకూ ఉన్న నిధుల్ని జీతాలు, పెన్షన్ల కోసం కాకుండా పథకాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక నుంచి అలా కాకుండా.. ముందు జీతాలే ఇస్తామంటున్నారు. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు మహదానందపడిపోయారు. నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఐఆర్ ఎంత ఉందో.. పీఆర్సీ కూడా అంతే ప్రకటించిలెక్క సమయం చేస్తారని అప్పటికే తేలిపోయింది. అంటే ఒక్క రూపాయి కూడా శాలరీ పెరగదు.
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టారు. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసి.. మాట్లాడటం వివాదాస్పదం అయింది. బెదిరించారని మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో తర్వాత అలాంటిదేమీలేదని వివరణ ఇస్తూ మరో ప్రెస్మీట్ పెట్టారు. ఈ వివాదాల నేపధ్యంలో సీఎంవో ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచినట్లుగా తెలుస్తోంది. రెండు సంఘాల జేఏసీ నేతలను మాత్రమే చర్చలకు పిలువడంతో ఇతర ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. అవన్నీ టైంపాస్ మీటింగ్లేనని ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.