ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్డీపీ ఏడేళ్లలోనే రెట్టింపు అయింది. తెలంగాణ అభివృద్దిని కరోనా కూడా ఆపలేకపోయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది.
ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో అయిదు రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్దిని చూపిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కరోనా కూడా ఆపలేకపోయింది. కరోనా కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది.
విద్యుత్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కంటే విడిపోయిన తర్వాత తెలంగాణ అద్భుత ప్రగతి సాదిస్తోందని బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని.. దానికి అభివృద్ధే సూచిక అని ప్రభుత్వం చెబుతోంది.