అమ్మఒడి ఇస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది అమ్మఒడి డబ్బులకు బదులుగా ల్యాప్ ట్యాప్ ఇస్తామనిప్రకటించారు. దీని కోసం ఇప్పటికే కంపెనీలతో చర్చలు కూడా జరిపామన్నారు. అమ్మఒడి సభలో తాము ఇస్తామన్న ల్యాప్ ట్యాప్‌ను బహిరంగంగా ప్రదర్శించారు కూడా. ఆ తర్వాత పలు సందర్భాల్లో ల్యాప్ ట్యాప్‌ల ప్రస్తావన తీసుకు వచ్చారు. అమ్మఒడి లబ్దిదారుల వద్ద నుంచి వాలంటీర్లు అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఇక ల్యాప్ ట్యాప్‌లు వస్తాయని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే సీఎం జగన్ హఠాత్తుగా అమ్మఒడి పథకాన్ని జూన్ నుంచిఅమలు చేస్తామని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరానికి జనవరిలో ఇస్తరా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఒకే ఏడాదిలో అంటే జనవరిలో.. జూన్‌లో రెండు సార్లు అమ్మఒడి ఇవ్వాలంటే ప్రభుత్వానికి భారం అవుతుంది. అందుకే జనవరిలో అమ్మఒడి ఇవ్వబోరన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే చెప్పిన ల్యాప్ ట్యాప్‌ల సంగతి ఏమయిందనేది చాలా మందికి వస్తున్న సందేహం.
అమ్మఒడి పథకం అందుకునేవారంతా పేదలే కావడంతో ఎక్కువ మంది తల్లులు తమ అకౌంట్లో డబ్బులు పడితే కుటుంబ అవసరాల కోసం వాడేస్తూ ఉంటారు. దీని వల్ల పథకం ఉద్దేశం పెద్దగా నెరవేరదు. అందుకే జగన్మోహన్ రెడ్డి నేరుగా విద్యార్థులకే మేలు కల్పించేందుకు ల్యాప్ ట్యాప్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. మార్కెట్లో మంచి ల్యాప్ ట్యాప్ పదిహేను వేలకు రాదు. కనీసం పాతిక వేలు పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది కాబట్టి పదిహేను వేలకే కంపెనీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు కూడా ఆశగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జనవరి నుంచి జూన్‌కు మారిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.