తెలుగు360 రేటింగ్: 2.75/5
ఒక్క సినిమా చాలు. అందరి దృష్టినీ తిప్పుకోవడానికి. అలా ఆర్.ఎక్స్ 100తో టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యాడు… అజయ్ భూపతి. అందరిలాంటి దారి తనది కాదని తొలి సినిమాతో నిరూపించుకున్నాడు. దాంతో.. రెండో సినిమాకి అవకాశాలు వరుస కట్టాయి. అయితే తనేం తొందరపడలేదు. రెండో సినిమాకి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నాడు. ఓ కథ రాసుకుని, దానికి న్యాయం చేసే హీరోల చుట్టూ తిరిగాడు. ఓవైపు శర్వానంద్, మరోవైపు సిద్దార్థ్, కావల్సిన తారాగణం, సాంకేతిక బలం. ఇవన్నీ `మహా సముద్రం`కి కుదిరాయి. తొలి సినిమాలోలా బడ్జెడ్ పరిమితులు లేవు. స్టార్లకు కొదవ లేదు. దానికి తోడు ట్రైలర్లు కూడా… సౌండ్ వినిపించాయి. అలా… `మహా సముద్రం`పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆర్.ఎక్స్ 100తో తన స్టామినా చూపించిన అజయ్ భూపతి మైలేజీ లెక్క తేల్చాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో ఆ లెక్క తేలిందా? మహా సముద్రం లోతెంత? ఈ సముద్రంలో దాగున్న నిజాలేంటి?
అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్దార్థ్) ఇద్దరూ మంచి స్నేహితులు. అర్జున్ ఏదైనా ఓ వ్యాపారం చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటాడు. విజయ్‌కి ఎస్.ఐ అవ్వాలని కోరిక. అయితే… దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కాదు. అధికారం, డబ్బు… రెండూ వస్తాయని ఆశ. మహా (అదితిరావు హైదరీ) విజయ్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. విజయ్ కి కావల్సినప్పుడల్లా మహా డబ్బులు సర్దుబాటు చేస్తుంది. విశాఖపట్నంలో ధనుంజయ్ (కేజీఎఫ్ రామ్) పెద్ద గుండా. స్మగ్లింగ్ చేస్తుంటాడు. తనని ఎదిరించడం ఎవరి తరమూ కాదు. సొంత తమ్ముడైన గూను బాబ్జీ (రావు రమేష్) కూడా తనని ఏం చేయలేకపోతాడు. అయితే అనుకోకుండా.. ధనుంజయ్ కీ, విజయ్‌కీ మధ్య గొడవ జరుగుతుంది. ధనుంజయ్ నుంచి ప్రాణాలు కాపాడుకోవాల్సిన తరుణంలో… విశాఖపట్నం వదిలేసి పారిపోతాడు విజయ్. కాకపోతే.. ఈమధ్యలో విజయ్‌కీ అర్జున్ కీ మధ్య విబేధాలు మొదలవుతాయి. తనని ప్రేమించిన మహాని కూడా అర్జున్ వదిలేస్తాడు. ధనుంజయ్ నుంచి విజయ్‌నీ, తన కుటుంబాన్నీ కాపాడుకోవల్సిన తరుణంలో.. అర్జున్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయంతో ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనేది మిగిలిన కథ.
సింపుల్ లైన్ ని పట్టుకుని రెండు గంటల సినిమాలు చేసేయడానికి ఈతరం దర్శకులు ఇష్టపడుతున్నారు. కానీ… అజయ్ భూపతి మాత్రం చాలా పెద్ద సెటప్పే వేసుకున్నాడు. చాలా పాత్రలు, కథలో సంఘర్షణ, స్నేహం, ప్రేమ, వైరం.. ఇలా చాలా చాలా చూపించాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే పాత్రధారుల్ని ఎంచుకున్నాడు. చెప్పాల్సిన విషయం పెద్దదైనప్పుడు కథలో సూటిగా వెళ్లిపోవాలి. అజయ్ భూపతి కూడా అదే చేశాడు. కాకపోతే.. పాత్రలెక్కువాయె. ఒకొక్క పాత్రనీ, ఈ కథలో ఆ పాత్రలకున్న ప్రాధాన్యతనీ చెప్పుకోవడానికే 20 నిమిషాలు పట్టేస్తుంది. దాంతో ఆరంభంలోనే కథ నెమ్మదించిన ఫీలింగ్ వస్తుంది. సిద్దార్థ్ – అతిథి లవ్ ట్రాక్ ఒకవైపు.. శర్వా – అను ఇమ్మానియేల్ ల ప్రేమకథ మరోవైపు. మధ్యలో గూను బాబ్జీ, చుంచు మామ కథలు. ఇలా.. సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లేసరికి.. కథని ముక్కలు ముక్కలుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ధనుంజయ్ తో అజయ్ గొడవ పడిన సన్నివేశం నుంచీ – కథ పరుగెడుతుంది. ఇంట్రవెల్ వరకూ… ఆ స్పీడు కనిపించింది.
సెకండాఫ్ కి మంచి టేకాఫ్ వేసుకున్నా – పరుగుందుకోవడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అర్జున్ స్మగ్లర్ గా ఎదగడం, గూను బాబ్జీ సామ్రాజ్యాన్ని పతనం చేయడం ఇవన్నీ చాలా రొటీన్ గా అనిపిస్తాయి. అర్జున్ – మహా మధ్య బంధాన్ని సరిగా, కన్వెన్స్ గా చెప్పలేకపోయాడు. మళ్లీ సిద్దార్థ్ సిటీలోకి ఎప్పుడొస్తాడా అని ప్రేక్షకులతో పాటు, కథ కూడా ఎదురుచూస్తుంటుంది. కానీ.. ఆ పాత్ర వచ్చిన తరవాత కూడా గేరు మార్చాలన్న ఆలోచన దర్శకుడికి రాలేదు. విజయ్ సిటీకి మళ్లీ ఎందుకొచ్చాడన్నది రావు రమేష్ పాత్రతో, అసలు అర్జున్ స్మగ్లింగ్ లోకి ఎందుకొచ్చాడన్నది చుంచుమామ పాత్రతోనూ చెప్పించారు. నిజానికి అది కూడా అవసరం లేదు. ఈ రెండు ఎపిసోడ్లనీ దర్శకుడు ట్విస్టులుగా భావించి ఉంటాడు. కానీ ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు రాదు. మహాని విజయ్ కేవలం డబ్బుల కోసం వాడుకున్నాడేమో అనుకుంటే… చివర్లో పాప సీన్ లో అంత ఎమోషన్ అవసరం లేదు. అర్జున్‌ని విజయ్ ద్వేషించుకోవడంలో కూడా అర్థం లేదనిపిస్తుంది. కేవలం చుంచుమామపై ఉన్న కోపమే అర్జున్ పై చూపించాడనుకుంటే – వారిద్దరి స్నేహం తేలికైపోతుంది. ఈ సన్నివేశాల్ని దర్శకుడు ఇంకొంచెం క్లారిటీతో రాసుకోవాల్సింది. పతాక సన్నివేశాల్లో బలం లేదు. సినిమాటిక్ ట్విస్టులతో ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.
అజయ్ భూపతి చేసిన మంచి పని. ఈ కథకు తగిన నటీనటుల్ని ఎంచుకోవడం. శర్వానంద్ అలవాటు ప్రకారమే బాగా చేశాడు. ఆ పాత్రని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా నటిస్తూ వెళ్లిపోయాడు. తను అన్ని రకాల ఎమోషన్లనీ బాగా పండించగలడు. అదే ఈ సినిమాతోనూ రుజువైంది. సిద్దార్థ్‌కి ఇదో కొత్త తరహా పాత్ర. తన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. అయితే ఈ పాత్రని ఇంకాస్త శ్రద్ధగా రాసుకోవాల్సింది. సెకండాఫ్‌లో చాలా కీలకమవ్వాల్సిన పాత్రని – తేల్చేశాడు దర్శకుడు. అతిథిరావు ది కీలకమైన పాత్ర. తన వరకూ న్యాయం చేసింది. అను ఇమ్మానియేల్ ని గెస్ట్ అనుకోవొచ్చు. చుంచు మామగా జగపతిబాబు పర్‌ఫెక్ట్. గూను బాబ్జీగా రావు రమేష్ ప్రత్యేకంగా కనిపించాడు. కాకపోతే… ఇన్ని పాత్రల మధ్య గూను బాబ్జీ తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతికంగా ఈసినిమా బాగుంది. విశాఖ చుట్టూ తిరిగే కథ ఇది. విశాఖ సముద్రాన్ని – ఈ కథ మూడ్ కి తగ్గట్టుగా చూపించుకుంటూ వెళ్లారు. సయ్యద్ రాసిన కొన్ని సంభాషణలు బాగున్నాయి. బలమైన కథ, పాత్రలు రాసుకున్న అజయ్ భూపతి.. ఆ పాత్రలన్నింటికీ సమన్యాయం చేయాలని తపించాడు కానీ కుదర్లేదు. స్క్రీన్ ప్లే మరీ వీక్ గా ఉంది. చాలా బోరింగ్ సీన్లు కనిపిస్తాయి. మహా సముద్రం పేరుకు తగ్గట్టుగా ఆటు పోట్లతో సినిమా సాగింది. హే రంభా.. రంభా… మంచి బీట్ ఉన్న మాస్ సాంగ్. నేపథ్య సంగీతం కూడా… పర్ఫెక్ట్ గా కుదిరింది.
తొలి సినిమా హిట్టవ్వగానే… ఏ దర్శకుడిపైనైనా అంచనాలు పెరుగుతాయి. దర్శకుడ్ని నమ్మి నిర్మాతలు ముందుకు వస్తారు. దాంతో కావల్సిన బడ్జెట్లు దొరుకుతాయి. హీరోలు రెడీగా ఉంటారు. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అజయ్ భూపతి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని, పటిష్టమైన కథ రాసుకున్నా, దాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడంలో మాత్రం తడబడ్డాడు. మొత్తానికి పాత్రలు, సంఘర్షణలు ఎక్కువైపోయిన ఈ మహా సముద్రం.. అటు ప్రేమకథ కాదు. అలాగని ఇటు స్నేహితుల కథ కూడా కాకుండా పోయింది.
తెలుగు360 రేటింగ్: 2.75/5