రాజీనామాలు చేసి ప్రశ్నిస్తాం అన్న ప్రకాష్ రాజ్ ఎందుకో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఆయన ఏదో చేయాలని అనుకుంటున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాసి .. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “మా” పోలింగ్ సందర్భంగా తమ సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని … మోహన్ బాబు, నరేష్ అనుచితంగా ప్రవర్తించారని ఆ సీసీ ఫుటేజీ కావాలన్నారు.
పోలింగ్ ఏరియాలో మోహన్ బాబు, నరేష్ అనుచరులు మోహరించడానికి పోలింగ్ అధికారి స్థానంలో ఉన్న కృష్ణమోహనే సహకరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలియాలని… “మా” సభ్యులు కూడా నిజాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారని లేఖలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని పొందే ప్రజాస్వామ్య హక్కు తమకు ఉందన్నారు. ప్రకాష్ రాజ్ లేఖపై “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కూల్‌గా స్పందించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి రికార్డు భద్రంగానే ఉందన్నారు. సీసీ టీవీ ఫుటేజీ కూడా భద్రంగానే ఉందని.. ప్రకాష్‌రాజ్ కు ఇస్తామని కృష్ణమోహన్ ప్రకటించారు.
అందర్నీ కలుపుకుని వెళ్తాను అని మంచు విష్ణు చెబుతున్నారు కానీ.. ప్రకాష్ రాజ్ టీం మాత్రం తాడో పేడో తేల్చుకోవాలన్నట్లుగా అడుగులు వేస్తోంది. న్యాయపోరాటం చేస్తారన్న ప్రచారం కారణంగా మంచు విష్ణు హడావుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన 16వ తేదీన అధికారికంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ లోపు సీసీ ఫుటేజీ కోసం ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. దానితో ఆయనేం చేస్తారో కానీ వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది.