భీమ్లా నాయక్ షూటింగ్ సెట్లో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ చర్చలు జరిపారు. మాములుగా అయితే ఎవరూ పట్టించుకోరు కానీ ప్రస్తుతం “మా” రగడ కొనసాగుతున్నందున అదే అంశంపై చర్చించేందుకు మోహన్ బాబు పంపించి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మోహన్ బాబు మా ఎన్నికల్లో పైచేయి సాధించారు. ఎలా సాధించారన్నదానిపై విమర్శలు ఉన్నా.. గెలుపు గెలుపే. ఇప్పుడు అందర్నీ కలుపుకుని వెళ్తే తప్ప ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు.
ఏకపక్షంగా వెళ్తే ఇండస్ట్రీ చీలిపోతుంది. ఇలాంటి సమయంలో బాధ్యత తీసుకున్న మోహన్ బాబు మెగా క్యాంప్‌తో మళ్లీ మంచి సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని కలుస్తానని మంచు విష్ణు ప్రకటించిన తర్వాత మంచు మనోజ్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. ఎన్నికలకు ముందు మోహన్ బాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివాదం ఉంది. పాయింట్ టు పాయింట్ స్పందిస్తానని మోహన్ బాబు ప్రకటించారు.
కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. మాట్లాడాలని కూడా అనుకోవట్లేదని చెబుతున్నారు. టాలీవుడ్‌లోని పెద్దలందరూ ప్రస్తుతం వివాదానికి ముగింపు పలికి అందరూ కలిసి పని చేసుకోవాలనే పద్దతిలో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మోహన్ బాబు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మంచు మనోజ్ కలిశారని అంటున్నారు. అదే నిజమైతే.. మా రాజకీయాలకు టాలీవుడ్లో పుల్‌స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు.