టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల ఆయన ఇంట్లో కింద పడ్డారు. దీంతో ఆయన చెయ్యి విరిగింది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను పరామర్శించేందుకు రేవంత్ వెళ్లారు. తాను కిందపడ్డానని తెలుసుకుని, పరామర్శించేందుకు రేవంత్ రావడం సంతోషం కలిగించిందని డీఎస్ ప్రకటించారు. అటు డీఎస్ కానీ ఇటు రేవంత్ కానీ రాజకీయాలేమీ లేవని అన్నారు. కానీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడే అయినా ఆ పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉంటున్న డీఎ్సను రేవంత్ వెళ్లి కలవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికలకు ముందు సోనియాతోనూ సమావేశమయ్యారు. కానీ ఎందుకో ఆయన చేరిక ఆగిపోయింది. బహుశా కాంగ్రెస్‌లో చేరితే ఆయన రాజ్యసభ సభ్యత్వంపై టీఆర్ఎస్ నేతలు అనర్హతా వేటు వేయిస్తారేమోనని అనుకున్నారేమో కానీ ఆగిపోయారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే ఆయన చిన్న కొడుకు అరవింద్ బీజేపీలో చేరి.. నిజామాబాద్ నుంచే ఎంపీగా గెలిచారు.
కానీ ఆయన బీజేపీలో మాత్రం చేరాలని అనుకోలేదు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ వెళ్లి ఆయనను కలిశారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరనున్నట్లు ప్రకటించారు. అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే త్వరలోనే డీఎస్ కూడా సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే డీఎస్ పార్టీలోకి వచ్చినా ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాధాన్యం దక్కే అవకాశం లేదని .. కానీ ఆయన సేవలు మాత్రం వినియోగించుకుంటారని రేవంత్ వర్గీయులు అంటున్నారు.