“వీర సావర్కర్” ఆరెస్సెస్ బీజేపీ నేతలకు గొప్ప దేశభక్తుడు. కానీ కాంగ్రెస్ నేతలకు మాత్రం దేశద్రోహి. ఆయన స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్లు జైలుకు పంపిస్తే.. వాళ్లకి అనుకూలంగా పని చేస్తానని జైలు నుంచి విడుదల చేయాలని అదే పనిగా లేఖలు రాశారు. ఇప్పటి వరకూ బయట ప్రపంచానికి ఇది తెలుసు. అయితే వీర సావర్కర్ ను బీజేపీ నేతలు స్వాతంత్ర్య సమరయోధుడిగా కీర్తిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాజ్ నాథ్ సింగ్ ఆయనపై పడిన మచ్చను మహాత్మాగాంధీపై తోసేసే ప్రయత్నం చేశారు. ఇది దేశంలో కొత్త చర్చకు కారణం అవుతోంది.
వీర సావర్కర్ తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్నో క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారని…అవన్నీ మహాత్మా గాంధీ సూచనల మేరకే రాశారని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మార్క్సిస్ట్, లెనినిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తులే ఆయనను నియంతృత్వవాది అని వక్రీకరించారని ఆరోపించారు. నిజానికి 1911లో వీర్ సావర్కర్‌కు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చారు. మరి ఎప్పుడు లేఖలు రాయాలని సలహాలు ఇచ్చారో చెప్పాలని రాజ్ నాథ్‌ను చరిత్ర కారులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి గాడ్సే నేరుగా గాంధీని హత్య చేశారు. కానీ గాంధీ హత్య కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై 1949లో సావర్కర్ అరెస్టయ్యారు. ఆధారాలు లభించకపోవడంతో విడుదలయ్యారు. మహాత్ముడిని బీజేపీ నేతలు కించ పరచడం ఇదే మొదటి సారి కాదు. గాంధీ వర్థంతిని ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న కొన్ని సంఘాలు శౌర్య దివస్‌గా పాటిస్తూ ఉటాయి. నాథూరాం గాడ్సేకున నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇలా చేస్తూ వారి భావజాలాన్ని ప్రజల్లో పెంచుతున్నారు. చివరికి జాతిపితను కూడా మారుస్తారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.