రెండున్నరేళ్ల పాలనా సమయం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సొంత పార్టీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. ఈ సారి కడప జిల్లా నుంచి సీనియర్ నేడ డీఎల్ రవీంద్రారెడ్డి నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తెర ముందుకు వచ్చారు. పోటీ చేసే అవకాశం రాకపోయినా వైసీపీలో చేరిన ఆయన ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు సహా ఏ రాజకీయ అవసరం వచ్చినా వైసీపీకే అండగా నిలిచారు. అయితే ఆయన అనుకున్న విధంగా ఎమ్మెల్సీ లేకపోతే ఇతర పదవి ఏమీ ఇవ్వలేదేమో కానీ.. ఆయన స్వరం పెంచారు.
ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని.. రైతులకను పట్టించుకునేవారే కరువయ్యారని డీఎల్ ప్రెస్మీట్ పెట్టి మరీ తేల్చేశారు. పంట గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి కృష్ణారెడ్డి అనే వ్యక్తికి వ్యవసాయ సలహాదారు పదవి ఇవ్వడంపై మండిపడ్డారు. ఆయన దొంగ ఆయిల్ వ్యాపారం చేస్తారన్నారు. రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చిందనేశారు. సలహాదారు సజ్జలను ఆయన వదిలి పెట్టలేదు. మంత్రులు డమ్మీలుగా మారిపోయారని..ఏ శాఖ మంత్రి కూడా ఆ శాఖపై మాట్లాడరని దారినపోయే వారంతా మీడియా సమావేశాలు పెడతారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని డీఎల్ రవీంద్రారెడ్డిస్పష్టంచేశారు. సహజంగానే వైసీపీలో అసంతృప్తి స్వరాలు.. అదీ కడప నుంచి వినిపించాయంటే విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికరమే . అందుకే ఆయనను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నించాలని లేకపోతే.. ఆయన మరిన్ని ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నారు. సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఇక ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చన్న ప్రచారం ప్రారంభమవుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.