టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిపోయిన ఎమ్మెల్యేలను మళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు కాంగ్రెస్‌కు భవిష్యత్‌కు లేదని నమ్మడం.. టీఆర్ఎస్ చేరుతామంటే ఆపే వారు కూడా లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా వెళ్లి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల్లో చాలా మందికి అక్కడ ఉక్కపోత ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. అందుకే అలాంటి వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌లోకి లాగాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
మొత్తంగా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలు చేరారు. వారిపై టీ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఒత్తిడి పెంచుతున్నారు. వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారిపై అనర్హతా వేటు వేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని.. దమ్ముంటే రాజీనామాలు చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. రేవంత్‌కు వారు కూడా ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అయితే ఆ ఒత్తిడి తర్వాత ఇప్పుడు రూటు మార్చి చర్చలు ప్రారంభించారు. టీఆర్ఎస్లో ఆదరణ దక్కలేదని ఫీలవుతున్న నలుగురు ఎమ్మెల్యేలతో రేవంత్ రహస్యంగా సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్‌లో చేరికల విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓవర్ లోడ్ అయిన కారు పార్టీ నుంచి ప్రజాబలం ఉన్న నేతల్ని గుర్తించి కండువా కప్పేస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణను చేర్చుకున్నారు. సీనియర్లు అయిన డీఎస్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్లో పార్టీ పరమైన పదవుల పంపకం పూర్తయిన తర్వాత రేవంత్ ఆకర్ష్ మరింత సక్సెస్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.