మోత్కుపల్లి నర్సింహులను పార్టీలో చేర్చుకున్న చేర్చుకోకపోయినా దళిత బంధు పథకానికి చైర్మన్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కారణం ఏమిటో కానీ దళిత బంధుకు మాత్రం ఇంత వరకూ చట్టబద్దత కల్పించలేదు. దాంతో ఆ పథకానికి చైర్మన్ నియమించే అవకాశం లేదు. అయితే పార్టీలో చేర్చుకోవాలని మాత్రం కేసీఆర్ డిసైడయ్యారు. వాయిదాలు వేసి వేసి చివరికి సోమవారం మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్లో చేరాలని ప్రయత్నిస్తున్న ఆయనకు.. కేసీఆర్ దళిత మిషన్ కలిసి వచ్చింది.
దళితుల్ని గుంపగుత్తగా ఓటుబ్యాంక్‌గా మార్చుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మోత్కుపల్లినీ దగ్గరకు చేర్చుకుంటున్నారు. నిజానికి మోత్కుపల్లితో కేసీఆర్ అంత సన్నిహిత సంబంధాలేమీ లేవు. ఆయన నోరు పై సదభిప్రాయం కూడా లేదు. టీడీపీలో ఉండి.. బీజేపీలో ఉండి కేసీఆర్‌ను ఆయన తిట్టినతిట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. పదవి.. ప్రాధాన్యం దక్కకపోతే మోత్కుపల్లి తిట్లు లంకించుకుంటారు. అయితే దళిత మిషన్‌లో భాగంగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ పదవి ఏమి ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. పదవి ఇవ్వకపోతే ఆయన ఊరుకోరు. వచ్చే ఎన్నికల వరకు ఆయనను ఉపయోగించుకుని మళ్లీ గెలిస్తే మంచి పదవి ఇస్తామని చెప్పి ఆయన సేవలను ఉపయోగించుకుంటే సరే ..మోత్కుపల్లికి ఇప్పుడే పదవి కావాలనిపిస్తే మాత్రం కేసీఆర్‌కు ఇబ్బందే. కేసీఆర్ బలహీనతను మోత్కుపల్లి గుర్తిస్తే.. ఆయన టైప్ వ్యాఖ్యలు ప్రారంభించి.. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలే ఎక్కువ ఉంటాయని టీఆర్ఎస్లోనే చర్చ జరుగుతోంది.