సోషల్ మీడియా విజృంభిస్తున్న తరుణంలో.. ప్రింట్ మీడియా ఇప్పటికే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ నాలుగేళ్లలో ముఖ్యంగా కరోనా తరవాత పేపర్లు చదివేవాళ్లు బాగా తగ్గిపోయారు. పైగా అన్నీ సద్దివార్తలే. ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానళ్లలో 24 గంటలూ… నిరంతర వార్తా స్రవంతి కొనసాగుతూనే ఉంది. విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. ఈరోజు వార్త.. ఇప్పుడే చెప్పేయాలన్న తొందర పెరుగుతోంది. దాంతో…పేపర్లో వచ్చేవన్నీ సద్దువార్తలైపోతున్నాయి. పేపర్ తెరిస్తే… అన్నీ తెలిసిన విషయాలే ఉంటున్నాయి. దాంతో ఆ ఆసక్తి మరింత సన్నగిల్లుతోంది.
ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియాకు మళ్లీ పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి? అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి మీడియా సంస్థలు. ఈ నేపథ్యం సాయంకాలం పత్రికలపై దృష్టి పెట్టారు. ఈవినింగ్ ఎడిషన్ అన్నది కొత్త విషయం ఏం కాదు. చాలా చోట్ల ఉన్నదే. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో సాయింకాలపు పత్రికలు రన్నింగ్‌లోనే ఉన్నాయి. ఉదయం నుంచి – సాయింత్రం వరకూ జరిగే వార్తలన్నీ కలిపి నాలుగు పేజీల్లో ఈవినింగ్ ఎడిషన్ పేరుతో వదిలితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడ్డాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి లాంటి మీడియా గ్రూపులు. ఉదయం పేపర్ ఎలాగూ వస్తుంది. సాయింత్రంలోగా జరిగే.. విషయాల్ని వేడిగా అందిచాలన్నది ప్రింట్ మీడియా తాపత్రయం. నాలుగు పేజీలే కాబట్టి.. తక్కువ రేటుకి ఇవ్వొచ్చు. అయితే ఈవినింగ్ ఎడిషన్ లోని సాధక బాధకాలేంటి? ఉద్యోగుల సంఖ్య పెంచాల్సి వస్తుందా? ఉన్న ఉద్యోగులతోనే నడపొచ్చా? అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారు. కనీసం నాలుగు ప్రధాన పత్రికలలో ఒక పత్రిక ఈవినింగ్ ఎడిషన్ అతి త్వరలో మొదలెట్టే అవకాశం ఉంది. అది సక్సెస్ అయితే.. మిగిలిన పత్రికలన్నీ అదే బాట పట్టడం ఖాయం.