కాంగ్రెస్ కోసం పని చేస్తారా.. లేక కాంగ్రెస్‌లో చేరుతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగిస్తున్న ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మెల్లగా రాహుల్ గాంధీని సైడ్ చేసి ప్రియాంకను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాహుల్ కంటే ప్రియాంకనే ఎగ్రెసివ్ అని ఆయన చెబుతున్నారు. అందుకే ఆమెను రాహుల్ నియంత్రిస్తున్నారని చెబుతున్నారు. గతంలో జరిగిన యూపీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. దానికి కారణం ప్రియాంక ఎక్కడ ఎదిగిపోతుందోనని రాహుల్ గాంధీ ఆందోళన చెందడమేనేట.
ఈ విషయాన్నీ పీకే నేరుగానే చెబుతున్నారు ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారని, ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని కితాబునిస్తున్నారు. ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ భయపడుతున్నారని తేల్చేశారు. పీకే వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. రాహుల్ బదులు ప్రియాంకకు పగ్గాలివ్వాలని కాంగ్రెస్‌లో ఓ డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది.
ఈ క్రమంలో పీకే వ్యాఖ్యలు హైలెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ పనులు చక్క బెడుతున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో పీకే వ్యాఖ్యలు రాజకీయంగానూ కీలకమయ్యే అవకాశం ఉంది.